కేసీఆర్‌కు చావు దెబ్బ‌… పార్ల‌మెంటులో వినిపించ‌ని గ‌ళం!!

“ఎగ్జిట్ పోల్స్ లేవు.. బ‌గ్జిట్ పోల్స్ లేవు పోవాయ్‌” అన్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగిపోయింది. తెలంగాణ కోసం ఉద్యమించిన విశ్ర‌మించ‌ని సూరీడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ ప‌రిస్థితి రాజ‌కీయంగా అస్త‌మ‌యం దిశ‌గా దూసుకుపోయింది. అంద‌రూ అంచనా వేసిన‌ట్టుగానే.. కేసీఆర్ పార్టీ అత్యంత దారుణ‌, ద‌య‌నీయ స్థితికి చేరిపోయింది. మొత్తం 17 స్థానాల్లో ఎక్క‌డా ఒక్క చోట కూడా.. బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌లేక పోయింది.

వాస్త‌వానికి తెలంగాణ సాధ‌న జ‌రిగి కేవలం ద‌శాబ్ద కాల‌మే అయింది. ఇంకా, నాటి ఉద్య‌మాలు.. సంగ‌తులు, అరెస్టులు కూడా.. క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇలాంటి స‌మ‌యంలోనూ.. కేసీఆర్ బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే చావు దెబ్బ త‌గిలిన పార్టీని ఉన్న మూడు నెల‌ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకుని పార్టీని స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం ఎక్క‌డా చేయ‌లేదు. పైగా.. దొర‌ల పాల‌న అన్న విమ‌ర్శ‌ల‌ను కూడా.. కేసీఆర్ బ‌లంగా తిప్పికొట్ట‌లేక పోయారు.

ఫ‌లితంగా.. ఇప్పుడు మొత్తం 17 స్థానాల్లో క‌నీసం ఒక్క‌టైనా గెలుస్తార‌ని బీఆర్ ఎస్ సీనియ‌ర్లు చెప్పుకొచ్చారు. మెద‌క్ త‌మ‌దేన‌ని కూడా అనుకున్నారు. కానీ.. ఇక్క‌డ కూడా.. బీఆర్ఎస్ బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌లేక పోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వం త‌ర్వాత‌.. తొలిసారి పార్ల‌మెంటులో ప్రాతినిథ్యం లేకుండా పోయింద‌నే చెప్పాలి. 2002లో పార్టీని పెట్టిన త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌క కూడా.. బీఆర్ఎస్ లోక్‌స‌భ‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తూ వ‌చ్చింది.

కానీ, ఇప్పుడు కేవ‌లం పుష్క‌ర కాలంలోనే.. బీఆర్ఎస్‌కు పార్ల‌మెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోవ‌డం నిజంగా ఒక బ్యాడ్ అనే చెప్పాలి. గ‌తంలో ఏ పార్ల‌మెంటులో అయితే.. పోరాడి.. బ‌ల‌మైన గ‌ళం వినిపించారో.. ఏ పార్ల‌మెంటులో అయితే.. తెలంగాణ కోసం కోట్లాడారో.. అదే పార్ల‌మెంటులో బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోవ‌డం నిజంగా దారుణ‌మేన‌ని చెప్పాలి. ఇక‌, నుంచి బీఆర్ఎస్ ఆత్మ విమ‌ర్శ‌.. చేసుకుని ప‌ర‌నింద‌లు మానుకుంటేనే మేలు అంటున్నారు ప‌రిశీల‌కులు.