ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయని సీన్ ఏపీలో

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి చూపు.. ఫోకస్ మొత్తం ఏపీ మీదనే ఉంది. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? గెలిచిన పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని? జనసేన ప్రభావం ఎంతమేర ఉంటుంది? లాంటి ప్రశ్నలే ఉన్నాయి.

తెలుగుప్రజల ఆసక్తికి తగ్గట్లే.. ఎగ్జిట్ పోల్స్ సైతం తమ భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేయటంతో ఒకలాంటి కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో.. ఓటరు నాడి ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎవరెన్ని అంచనాలు వేసుకున్న.. చివరకు ఈవీఎంలు ఓపెన్ చేస్తే మాత్రమే ఫలితం అర్థమవుతుంది. ఈ విషయం ఈ రోజు ఓట్ల లెక్కింపు షురూ అయినంతనే అర్థమైంది.

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.. జనసేన కంటే తక్కువ స్థానాల్లో వైసీపీ అధిక్యతలో ఉండటం. ఇవే ఫైనల్ ఫలితాలు అని చెప్పట్లేదు. ఇప్పటికైతే.. అంటే ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో.. కౌంటింగ్ మొదలైన మొదటి గంటన్నరలో కనిపిస్తున్న సీన్ చూస్తే మాత్రం ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితి వైసీపీకి ఎదురవుతుందని అంచనా వేయలేదనే చెప్పాలి.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 56 స్థానాల్లో అధిక్యతలో నిలిస్తే.. అధికార వైసీపీ 9 స్థానాల్లో అధిక్యతలో ఉంది. జనసేన సైతం 9 స్థానాల్లో అధిక్యతలో ఉంది. బీజేపీ మూడు స్థానాల్లో అధిక్యతలో ఉంది. 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ 9 స్థానాల్లో అధిక్యతలో ఉంటే.. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన మాత్రం 9స్థానాల్లో అధిక్యతలో నిలవటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇదేమీ ఫైనల్ లెక్క కాదు. కాకుంటే.. కౌంటింగ్ మొదలైన మొదటి గంటర్న వేళకు.. ఇలాంటి సీన్ ను మాత్రం ఎవరూ ఊహించలేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే ఏపీలో టీడీపీ 11 స్థానాల్లో ముందంజలో ఉంటే.. అధికార వైసీపీ 2 స్థానాల్లో నిలిచింది. ఏపీలో ఏ మాత్రం బలం లేదని చెప్పే బీజేపీ ఏకంగా నాలుగు స్థానాల్లో అధిక్యతలో నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. ఏపీ అధికార పక్షం ఈ ఎన్నికల్లో తాను ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కొనేలా ఫలితాలు వెల్లడవుతాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.