బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరయిన నటి హేమ రేవ్ పార్టీ ఆర్గనైజింగ్ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఐదుగురితో కలిసి ఈ పార్టీ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు.
రేవ్ పార్టీని నిర్వహించడంతోపాటు.. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో నటి హేమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరచనున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు నటి హేమకు బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపించారు. కానీ ప్రతిసారి వివిధ కారణాలు చెబుతూ విచారణకు వెళ్లలేదు. హేమ తీరుపై విసుగు చెందిన పోలీసులు ఈరోజు హైదరాబాద్ చేరుకుని మరోసారి నోటీసులు పంపించగా ఎట్టకేలకు పోలీసుల ముందుకు బురఖాలో వెళ్లింది.
అయితే విచారణలో పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని, అలాగే పార్టీ ప్లాన్ చేయడం, నిర్వహించడంలో హేమ కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. దీంతో నటి హేమను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనరల్ హాస్పిటల్లో హేమాకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. ఈరోజు రాత్రికి స్టేట్ హోమ్ కు తరలించనున్నారు. రేపు మెజిస్ట్రేట్ ముందు హేమాను హాజరు పరచనున్నారు.