అరెస్ట్ నుండి హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలిక ఉపశమనం పొందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లిని ఆదేశించింది.
పోలింగ్ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతోపాటు పిన్నెల్లి అరెస్ట్ కి మినహాయింపు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఏజెంట్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై స్టే ఇవ్వకపోతే న్యాయవ్యవస్థను హేళన చేసినట్టేనని బెంచ్ అభిప్రాయపడింది.
విచారణ సందర్భంగా ఈవీఎం ధ్వంసం వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తుల ఎదుట ప్రదర్శించారు. అయితే ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు. ఇది అధికారిక వీడియో కాదు అంటూ పిన్నెల్లి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు.
అక్కడ ఫొటోలు కూడా ఉన్నాయి అన్న బెంచ్ నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని తెలిపింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని ఆదేశించింది. పిన్నెల్లిని 6వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టడం విశేషం.