రేపే విడుదల – అసలైన రాజకీయ సినిమా

ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తెలుగు ప్రజల మధ్య అత్యధిక స్థాయిలో రాబోతున్న చర్చ ఎన్నికల ఫలితాలు. తెలంగాణకు సంబంధించి కేవలం లోక్ సభకు మాత్రమే జరిగాయి కాబట్టి అంత ఫోకస్ ఉండకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం నేషనల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఎగ్జిట్ పోల్స్ అధిక శాతం టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయాన్ని ధృవీకరిస్తుండగా మరికొన్ని అధికార పీఠం వైసిపిదేనని చెప్పడం కొన్ని అనుమానాలు లేవనెత్తింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మెజారిటీ, చంద్రబాబు నాయుడు ఆధిపత్యం, బాలకృష్ణ హ్యాట్రిక్ మీద అధిక శాతం దృష్టి సారిస్తున్నారు.

న్యూస్ ఛానల్స్, ప్రింట్, వెబ్ మీడియా మొత్తం ఏకధాటిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా దీని కవరేజ్ కే ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. ఉత్తరాది కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా మల్టీప్లెక్సుల్లో పోలింగ్ రిజల్ట్స్ ని ప్రదర్శించడం కొత్త ట్రెండ్ కి దారి తీస్తోంది.

తక్కువ ధరకు టికెట్లు పెట్టి ఆరేడు గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ ని పెద్ద తెరల ద్వారా అందుబాటులోకి తేబోతున్నారు. మన దగ్గర కూడా ఆలోచించారు కానీ కొన్ని చోట్ల అల్లర్లు, గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పాటు టికెట్ ధరల మీద ఉన్న పరిమితుల కారణంగా సాధ్యపడటం లేదని సమాచారం.

విజేత ఎవరో తెలుసుకునే క్రమంలో పబ్లిక్ పెద్దగా థియేటర్లకు వెళ్లే మూడ్ లో ఉండరు. వెళ్లిన కాసిన్ని ఆడియన్స్ కూడా మొబైల్ లో ఫలితాలను చూసుకుంటూ గడిపే సీన్లే గమనించవచ్చు. అంతగా పొలిటికల్ ఫీవర్ నాటుకుపోయి ఉంది.

మొన్న రిలీజైన కొత్త సినిమాలు నిన్న వీకెండ్ దాకా మంచి వసూళ్లు రాబట్టుకున్నాయి కానీ ఇవాళ, రేపు కొంచెం కష్టంగానే గడవబోతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. ఓటింగ్ శాతం పెరగడం దానికి దోహదం చేసింది. చూడాలి మరి రేపటి రోజు ఎవరు విన్నర్ అవుతారో, ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారో.