రేవంత్ లెక్క త‌ప్పిందా?

తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌చ్చితంగా 14 సీట్లు గెలుస్తుంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఇదే విష‌యాన్ని ప‌దేప‌దే ప్ర‌స్తావించారు.

కానీ ఇప్పుడు రేవంత్ లెక్క త‌ప్పింద‌ని, కాంగ్రెస్‌కు బీజేపీ షాక్ ఇచ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. తాజాగా వెలువ‌డ్డ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా ప్ర‌కారం తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు డ‌బుల్ డిజిట్ సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాద‌ని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్ ఎంఐఎం ఒక చోట గెలుస్తుంద‌ని తెలిపాయి. ఇక మిగిలిన 16 స్థానాల‌ను బీజేపీ, కాంగ్రెస్ పంచుకునే అవ‌కాశ‌ముంది.

ఇందులో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏమో కాంగ్రెస్‌కు 7 నుంచి 8, బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు ద‌క్కే అవ‌కాశ‌ముంద‌ని తెలిపాయి. గ‌తేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యంతో కాంగ్రెస్ జోరుమీదుంది.

ఇదే ఉత్సాహంతో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ మెజారిటీ స్థానాలు కైవ‌సం చేసుకోవాల‌నే చూసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్ర‌చార భారాన్ని భుజాల‌పై మోశారు. పార్టీ అత్య‌ధిక స్థానాలు గెల‌వాల‌నే ల‌క్ష్యంతో సాగారు. కానీ ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం కాంగ్రెస్‌కు షాక్ త‌ప్ప‌ద‌నే చెప్పాలి.

ఓ వైపు బీజేపీ తెలంగాణ‌లో పుంజుకుంటోంది. దేశ‌వ్యాప్తంగా మోదీ చ‌రిష్మా కార‌ణంగా ఇక్క‌డా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాల దిశ‌గా సాగుతోంది. మ‌రోవైపు కాంగ్రెస్‌లో రేవంత్ త‌ప్పా మిగతా సీనియ‌ర్ నాయ‌కులు ప్ర‌చారంలో అంటీముట్ట‌న‌ట్లుగా ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌చార స‌మ‌యంలోనే దీనిపై అధిష్ఠానం వార్మింగ్ ఇచ్చినా నాయ‌కుల్లో మార్పు రాలేద‌ని అంటున్నారు. మ‌రోవైపు పొలం బాట‌, బ‌స్సు యాత్ర‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన కేసీఆర్ కాంగ్రెస్‌పై చేసిన విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు కూడా న‌ష్టం చేశాయ‌నే చెప్పాలి. కేంద్రంలో ఎలాగో మ‌రోసారి బీజేపీనే అధికారంలోకి వ‌స్తుంద‌నే భావ‌న‌తో జ‌నాలూ ఆ పార్టీకే మ‌ద్ద‌తుగా నిలిచారు.