వైసీపీ ధీమా.. కౌంటింగ్ ఏజెంట్ల కోసమేనా?

ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్నట్లే ఎన్డీయే కూటమి గెలుస్తోందని దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ తేల్చి చెప్పాయి. అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లే ఎన్డీయే కూటమి తెచ్చుకోబోతందని స్పష్టమైంది.

ఇక అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అధికారమని ప్రముఖ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ చరిత్రలోనే అత్యంత కచ్చితత్వం ఉన్న సంస్థగా పేరున్న ఇండియా టుడే కూటమికి 19-23 మధ్య లోక్‌సభ స్థానాలు వస్తాయని చెప్పింది.

వైసీపీ 2 నుంచి 4 సీట్ల వరకు గెలవొచ్చని చెప్పింది. దీన్ని బట్టి ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని అర్థం. మరి కొన్ని ప్రముఖ సర్వే సంస్థలు సైతం కూటమికే పట్టం కట్టాయి. క్రెడిబిలిటీ ఉన్న వాళ్లలో ఆరా మస్తాన్ మాత్రమే వైసీపీ విజయాన్ని అంచనా వేశారు.

ఐతే వైసీపీ మాత్రం ఆరా మస్తాన్‌‌ ప్రకటించిన అంచనాలను ప్రధానంగా ప్రచారం చేసుకుంటోంది. సాక్షి మీడియాలో కూడా ఆయన సర్వేకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇక పెద్దగా పాపులర్ కాని కొన్ని సంస్థల అంచనాలను పబ్లిష్ చేసుకుని వైసీపీనే గెలుస్తుందని ఢంకా భజాయిస్తున్నారు.

కానీ ఇంకో రెండు రోజుల్లో ఫలితాలు రాబోతుండగా.. ఇంకా ఇలా గాలి మేడలు కడుతూ వైసీపీ నేతలు, కార్యకర్తలను భ్రమలో ఉంచాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కచ్చితంగా గెలిచేలా కనిపిస్తున్న కూటమి చేయనంత హంగామా.. ఓటమి తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నా వైసీపీ ఎందుకు చేస్తోందన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఐతే ఫలితాలు వచ్చేలోపు చక్కబెట్టాల్సిన కార్యకలాపాలు చాలా ఉంటాయని, అధికారుల మీద పట్టుకోల్పోతే అవి కష్టమని.. దీనికి మించి ఓటమి తప్పదనే ఇండికేషన్ క్యాడర్లోకి వెళ్లిపోతే రేపు ఫలితాల రోజు కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి కూడా ఎవరూ రారని.. అది తమకు మరింత సమస్యగా మారుతుందని.. అందుకే ఆ రోజు వరకు ఇలాగే గెలుపు మీద కార్యకర్తల్లో ధీమా కలిగించడం అవసరమే వైసీపీ ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.