లేనిపోని గొడ‌వ‌కు పోయి కేసీఆర్‌కు చిక్కులు!

అధికారం ఉంద‌నే అహంకారంతో.. తెలంగాణ‌లో త‌న‌కు తిరుగేలేద‌నే అతి విశ్వాసంతోనే కేసీఆర్ ప‌రిస్థితి ఇలా మారిందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా బీజేపీలో ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌గా ఉన్న బీఎల్ సంతోష్ జోలికి కేసీఆర్ వెళ్ల‌డ‌మే ఆ పార్టీ కొంప ముంచింద‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలే మాట్లాడుకుంటున్నాయి.

జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని చూసిన కేసీఆర్ బీజేపీని ఇబ్బందుల్లో పెడ‌దామ‌ని అనుకున్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను టార్గెట్ చేశారు. ఆయ‌న్ని అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక విమానంలో పోలీసుల‌ను పంపార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

బీఎల్ సంతోష్ జోలికి వ‌చ్చిన కేసీఆర్‌ను వ‌దిలేదే లేద‌ని బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు తెలిసింది. అందుకే తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఓట‌మి కోసం ప‌ని చేసింద‌నే టాక్ ఉంది.

అప్ప‌టివ‌ర‌కూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్ దూకుడుతో ప‌ని చేశారు. కానీ ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న‌ట్లుండి సంజ‌య్ స్థానంలో కిష‌న్‌రెడ్డిని అధ్య‌క్షుడిగా అధిష్ఠానం నియ‌మించింది. దీని త‌ర్వాత బీజేపీ రేసులో వెనుక‌బ‌డిపోయింది. అక్క‌డి నుంచి కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ గెలిచినా ఫ‌ర్వాలేదు కానీ బీఆర్ఎస్ ఓడిపోవాల‌నే ల‌క్ష్యంతోనే బీజేపీ ప‌ని చేసిన‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో భాగంగా అరెస్ట‌యిన క‌విత ఇప్పుడు జైల్లో ఉన్నారు. కేసీఆర్ తన‌య అరెస్టు వెనుక బీజేపీ ఉంద‌ని బీఆర్ఎస్ నాయ‌కులు ఆరోపిస్తూనే ఉన్నారు. దీంతో అద‌ను చూసి బీజేపీ మ‌రో దెబ్బ కొట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

క‌విత‌కు ఎప్పుడు బెయిల్ వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్‌కు పేల‌వ ఫ‌లితాలు రావ‌డం ఖాయ‌మ‌నే టాక్ ఉంది. దీంతో బీఆర్ఎస్ ఉనికి, కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం మ‌రింత ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశ‌ముంది. లేనిపోని గొడ‌వ‌కు పోయి కేసీఆర్ ఈ చిక్కులు తెచ్చుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.