ఎగ్జిట్ పోల్స్‌ను మించిన జ్యోతిష్యుల పోల్స్..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ జూన్ 1న ముగియ‌నుంది. అయితే.. ఏపీలోమాత్రం పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ నెల 13నే ముగిశాయి. కానీ, ఫ‌లితాలు మాత్రం జూన్ 4న రానున్నాయి. ఇక‌, దీనికి ముందు… జూన్ 1న జ‌రిగే తుది ద‌శ పోలింగ్ ముగిసిన మ‌రుక్ష‌ణమే దేశంలోను.. నాలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ప్ర‌తిప‌క్షంలో కూర్చుంటార‌నే విష‌యాల‌ను ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌నున్నాయి. దీనికి సంబంధించి ఏపీలోనూ.. రంగం రెడీ అయింది.

కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు ఎలా ఉన్నా.. ఈలోగానే వెల్ల‌డ‌వుతున్న జ్యోతిష్యుల జోస్యాలు.. తారా బ‌లం, చంద్ర‌బలం, ఇత‌ర త్రా గ్ర‌హ‌రీతులు, గురు బ‌లం వంటివాటిని లెక్క‌లు వేసి.. ఆయా పార్టీల అధి నాయ‌కుల కేంద్రంగా ప‌లువులు జ్యోతిష్యులు.. కొన్ని కొన్ని జోస్యాలు వండివారుస్తున్నారు.ఇలా చెబుతున్న జ్యోతిష్యుల్లో ప్ర‌ముఖులు ఉండ‌డం.. వారు గ‌తంలో చెప్పిన వాటిపై న‌మ్మ‌కం క‌ల‌గ‌డంతో ఇప్పుడు కూడా వారి జ్యోస్యాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకుతోంది.

ఏపీలో ఎన్నిక‌లు ట‌ఫ్‌గా జ‌ర‌గ‌డం.. నువ్వా-నేనా అన్న‌ట్టుగా ఉండ‌డంతో జ్యోస్యాల‌కు రేటింగ్ పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు.. ఎగ్జిట్ పోల్స్‌ను వెల్ల‌డించ‌కూడ‌దు.. కానీ, జ్యోతిష్యం ఆధారంగా చెప్పే ఎగ్జిట్ పోల్స్‌పై ఎలాంటి నిబంధ‌న‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌ముఖ జ్యోతిష్యులు.. దూసుకు పోతున్నారు. వీరిలో తూర్పుగోదావ‌రికి చెందిన పేరున్న వారు కూడా ఉన్నారు.

క‌ప్ప‌గంతు శ్రీరామ‌కృష్ణ శ‌ర్మ: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడేనికి చెందిన శ‌ర్మ‌.. ప్ర‌ముఖ జ్యోతిష్యు లుగా గుర్తింపు పొందారు. త‌ర‌త‌రాలుగా జ్యోతిష్యం చెప్ప‌డం..పంచాంగం రాయ‌డంలో నిష్ణాతులు. ఈయ‌న తాజా ఎన్నిక‌ల‌పై స్పందిస్తూ.. వైసీపీ 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించారు.

ఉపదృష్ట నాగాదిత్య: తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురానికి చెందిన నాగాదిత్య వంశ పారంప‌ర్యంగా ఈ రంగంలో ఉన్నారు. అనేక మంది సినీ తార‌ల‌కు కూడా.. వీరు జాత‌కాలు చెప్పారు. ఇప్ప‌టికీ చెబుతున్నా రు. ఈయన అంచ‌నా ప్ర‌కారం.. టీడీపీ, జనసేన, బిజేపీ కూటమికి 135 సీట్లు వస్తాయి. వైసీపీ ఎదురీత ఈదుతోంది.

వేణు స్వామి: హైద‌రాబాద్ కు చెందిన ఈయ‌న కార్పొరేట్ జ్యోతిష్యాలు చెప్ప‌డంలో దిట్ట. ఈయ‌న కూడా ఏపీ ఫ‌లితంపై అంచ‌నా వేశారు. ఏపీలో వైసీపీ అతి క‌ష్టం మీద గ‌ట్టెక్కుతుంద‌ని చెప్పారు. అయితే.. వీరు ముగ్గురూ కూడా.. కామ‌న్‌గా ఎంచుకున్న‌ది.. సీఎం జగన్..చంద్రబాబు జాతకాలే. మ‌రి ఎగ్జిట్ పోల్స్‌ను మించి.. వీరు చెబుతున్న జ్యోతిష్యం పోల్స్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.