పోలీసు శాఖలో ఒక సంప్రదాయం ఉంది. ఒక అధికారి రిటైరైతే.. ఆయనను సిబ్బంది ఎంతో గౌరవంగా ఇంటికి తోడ్కొని వెళ్తారు. ఆ అధికారి స్తాయిని కూడా పట్టించుకోరు. కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు.. సాధారణ అధికారులనే భావన పోలీసు శాఖలో ఉంది. కానీ, వీరు రిటైరైతే మాత్రం.. వారిని ప్రత్యేక వాహనంలో ఎక్కించి.. దానికి తాళ్లు కట్టి ఇరు వైపులా అధికారులు, సిబ్బంది కూడా నిలబడి వాటిని లాగుతూ.. ఎంతో గౌరవంగా రిటైరైన అధికారిని ఇంటికి తీసుకువెళ్తారు. ఆయన చేసిన సేవలను కొనియాడతారు. సభ పెడతారు. ఇంటర్నల్ గానే అయినా.. ఆయనను సన్మానిస్తారు.
సిబ్బంది సొంత సొమ్ము ఖర్చు చేసి విందు ఏర్పాటు చేస్తారు. ఇలా.. పోలీసు శాఖలో ఎవరైనా రిటైరైతే.. ఇంత హంగామా చేస్తారు. తమ అభిమానాన్ని అన్ని స్తాయిల అధికారులు కూడా చాటుకుంటారు. కానీ, తాజాగా ఇలా పోస్టింగు పుచ్చుకుని.. అలా రిటైరైన ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో మాత్రం పోలీసులు ఎవరూ ముందుకురాలేదు. ఒక్క ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమల రావు తప్ప.. ఎవరూ వచ్చి ఆయనను అభినందించలేదు. కనీసం ఎస్సై స్థాయి అధికారులు కూడా వచ్చి.. ఏబీవీ సార్‌కి పుష్పగుచ్ఛం అందించింది లేదు. నిజానికి ఆయన కింద పనిచేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు.
అంతేకాదు.. ఏబీవీ ప్రోత్సాహంతో ఎన్నో కేసులు ఛేదించి.. ఉన్నత స్థానాల్లోకి బదిలీ అయి ప్రొమొషన్లు పొందిన వారు కూడా ఉన్నారు. మరి వీరంతా ఏమయ్యారు? ఎందుకు రాలేదు? కనీసం పన్నెత్తు మాట కూడా.. పలకరించేందుకు ఎందుకు సాహసించలేక పోయారు? వారు ఉద్దేశ పూర్వకంగానే దూరంగా ఉన్నారా? లేక.. ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అంటే.. రెండో సమాధానమే వినిపిస్తోంది. రిటైరైన ఏబీవీని ఎవరెవరు కలుస్తున్నారు? అనే విషయంపై ప్రభుత్వం పక్కా నిఘా పెట్టిందని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
ఇప్పుడు ఏబీవీని కలిసి.. పలకరించి.. అభినందిస్తే.. రేపు తమపై కక్ష పూరిత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వారు భీతిల్లినట్టుగా తెలుస్తోంది. అందుకే అందరూ దూరంగానే ఉన్నారు. డీజీ స్థాయి అధికారి.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చేసిన అధికారి.. రిటైర్ అయితే.. ప్రత్యేక వాహనాన్ని అలంకరించి.. దానికి తాళ్లు కట్టి.. డీఎస్పీలు.. ఎస్పీలు.. సహా అనేక మంది ఉన్నతాధికారులు ఆ తాళ్లతో వాహనాన్ని ముందుకు నడిపించి.. అత్యంత సమున్నతంగా రిటైర్మెంట్ జీవితాన్ని అభినందించాల్సిన చోట.. కేవలం .. కొద్ది మంది అభిమానులు
మాత్రమే.. తమ చేతులతో ఏబీవీని పైకెత్తి రెండడుగులు నడిపించి.. సరిపుచ్చే పరిస్థితి వచ్చింది.