ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేయాలని, ఏకంగా ఈసారి 400 స్థానాలలో విజయం సాధించాలని బీజేపీ ఈసారి 543 లోక్ సభ స్థానాలకు గాను ఏడు విడతలలో సుధీర్ఘ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ సుధీర్ఘ సమయం తమకు కలిసి వస్తుందని భావించింది. 21 లోక్ సభ స్థానాలున్న ఒడిశాలో ఏకంగా నాలుగు విడతలలో పోలింగ్ నిర్వహించింది.
అయితే తొలి దఫా ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఏడు దఫాల్లో నెలన్నర పాటు పోలింగ్ జరిగితే తమకు లాభిస్తుందనుకొన్న బీజేపీ అంచనాలు చివరకు తలకిందులయ్యాయి. ఒక్కో విడుత మధ్య సుమారు వారంపాటు వ్యవధి ఉండటంతో ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలను విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగాయి. దీంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది.
విజయావకాశాలపై దెబ్బతీస్తాయని బీజేపీ పెద్దయెత్తున సిట్టింగ్‌లకు టికెట్లను నిరాకరించింది. 130కు పైగా సీట్లలో కొత్తవారికి కట్టబెట్టింది. సిట్టింగుల మీద ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపించవచ్చన్న భయంతో వారిని తప్పించింది. ఇక గడిచిన మూడు దశాబ్దాలలో తొలిసారిగా ఈ సారి కశ్మీర్‌లో బీజేపీ పోటీకి దూరంగా ఉండటం గమనార్హం.
తొలిదశ పోలింగ్ సరళితో కంగుతిన్న మోడీ ఆ తర్వాత ప్రచారసరళిని మార్చి విద్వేష ప్రసంగాలకు తెరలేపారు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలు వదలదు. దేశ సంపదను చొరబాటు దారులు, ముస్లింలకు పంచుతుంది. వాళ్ల పాలనలో హనుమాన్ చాలీసా వినడాన్ని నేరంగా పరిగణిస్తారు. అయోధ్యలో రామమందిరం కూల్చేస్తారు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీకి 250 స్థానాలు దాటడం కష్టమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుధీర్ఘ ఎన్నికలే దీనికి కారణం అని, పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ఈ తరహాలో ప్రచారం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates