కమలంలో ఆధిపత్య ముసలం !

భారతీయ జనతా పార్టీలో ఆధిపత్య వైఖరి నివురుగప్పిన నిప్పులా ఉందా ? ఈ ఎన్నికల తర్వాత అది బయటపడనుందా ? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీల మధ్య ఇది రాజుకుంటున్నదా ? నాగపూర్ లో గడ్కరీని ఓడించడానికి మోడీ, షాలు ప్రయత్నించారా ? అంటే రాజకీయ వర్గాలు నిజమేనని అంటున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. 

మోదీ, అమిత్ షా వర్గం, గడ్కరీ వర్గానికి విభేధాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో  గడ్కరీకి అనుకూలవర్గంగా ఉన్న 1.5 లక్షల మంది నాగ్‌పూర్‌ ఓటర్ల పేర్లు జాబితాలో మాయమైనట్లు సమాచారం. దీనికి తోడు ఎన్నికల సమయంలో గడ్కరీకి సపోర్ట్‌గా మోదీ, షా ఎలాంటి ప్రచారం చేయలేదు. బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా నుండి మోడీ  గడ్కరీ పేరును పక్కనపెట్టారు.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలని గడ్కరీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల నడ్డా, షాలు ఆర్ఎస్ఎస్ అవసరం బీజేపీకి లేదని వ్యాఖ్యానించారని తెలుస్తుంది . గడ్కరీకి ఆర్ఎస్ఎస్ దగ్గర కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు.  ఈ మేరకు గడ్కరీ ఆర్ఎస్ఎస్ కీలక నేతలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

గడ్కరీ మోదీ-షా వ్యవహారశైలిని, ఆధిప్యత దోరణిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎండగడుతూ వస్తున్నారు. పాలనలో లోపాల మీద  2022లో సొంత సర్కారుపైనే గడ్కరీ విరుచుకుపడ్డారు. వాజ్‌పేయీ, అద్వానీ, దీన్‌దయాళ్‌ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని, వాడుకొని వదిలేయడమే ప్రధానమయ్యిందని వాపోయారు. దీంతో 2022లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి మోదీ గడ్కరీకి ఉద్వాసన పలికారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యం తగ్గించారు.

గడ్కరీ జాతీయ రహదారుల మంత్రిగా ఉండి రహదారుల బాగుకు  కృషిచేశాడన్న వార్తలను మోడీ జీర్ణించుకోలేకపోయారు. ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవేలో ఎక్కువ నిధులు ఖర్చు చేశారని కాగ్ ఇచ్చిన నివేదిక వెనక మోడీ ఆదేశాల మేరకు గడ్కరీ మీద బురదజల్లడమే లక్ష్యం అని అంటున్నారు. ఇక మహారాష్ట్రకు రావాల్సిన ఫాక్స్‌కాన్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ వంటి పెద్ద కంపెనీలను గుజరాత్‌కు మోదీ తరలించుకుపోవడం గడ్కరీకి అసంతృప్తికి మరో కారణం. ఈ పరిస్థితులలో ఎన్నికల ఫలితాల తర్వాత కమలం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.