తెలంగాణలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో జగన్మోహన్ రెడ్డి తరహాలో కొత్త మద్యం బ్రాండ్లను రంగంలోకి దించుతుందని, దీనికి గాను రూ.5 వేల కోట్లు చేతులు మారాయని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి తెలిసిన తెలంగాణ మద్యం ప్రియులు తెలంగాణలో ఉన్న బ్రాండ్లను తీసుకొస్తారేమో అన్న అందోళన నెలకొన్నది.
అయితే తెలంగాణ ఎక్సయిజ్ మంత్రి జూపల్లి క్రిష్ణారావు కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని, ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసినా, వార్తలు రాసినా రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ప్రకటించారు. అయితే మంత్రి ఆ ప్రకటన చేసే నాటికే తెలంగాణలో కొత్త బీరు బ్రాండ్లు మార్కెట్లోకి దిగిపోవడం విశేషం. దీంతో ఆయన తాజాగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లు వచ్చాయని, బీర్ల కొరత ఉన్నందుకే వాటిని అనుమతించామని, అయితే దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బేవరేజెస్ కార్పోరేషన్ దానికి అనుమతించిందని, ఆ సంస్థ రోజు వారీ కార్యకలాపాలు తనకు తెలియవని ప్రకటించాడు.
దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటయిన మద్యం అమ్మకాలకు సంబంధించిన కీలక విషయాలు తనకు తెలియదని మంత్రి ప్రకటించడం నిర్లక్ష్యానికి నిదర్శనం అని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా ఐదు బీర్ల సప్లయ్ కంపెనీలు అడుగుపెట్టాయి. ఈ కంపెనీలు సుమారు 27 రకాల బీర్లను తెలంగాణలో ప్రవేశపెట్టాయి. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కొత్తగా అనుమతులు ఇచ్చిన వాటిల్లో లీలాసన్స్ ఆల్కా బేవ్ ప్రై. లి, ఎక్సోటికా లిక్కర్ ప్రై. లి, టాయిట్ బ్రేవరీస్ ప్రై. లి, మౌంట్ ఎవరెస్ట్ లి. సోం డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ ఉన్నాయి.
ఎక్సైజ్‌శాఖ అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో ఒకటైన ‘లీలాసన్స్ ఆల్కా బెవ్’ సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తున్నది. ఇదే కంపెనీ ఏపీలో ‘ట్రెడిషనల్ ఎక్స్‌లెన్స్ ఇన్ క్వాలిటీ’ అనే కంపెనీ పేరుతో బీర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నది. అలాగే చెన్నైలో ‘సెయింట్ పాట్రిక్స్’ పేరుతో మద్యం బీర్లు తయారు చేస్తున్నది. దీని రిజిస్ట్రేషన్ మాత్రం మధ్యప్రదేశ్. ‘అమెరికన్ బ్రూవ్ క్రాఫ్ట్ లిమిటెడ్ (ప్రై)’తో ఇది టైఅప్ అయినట్లుగా సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను సైలెంట్ గా మార్కెట్లోకి దించేసింది. కొత్త రకం బీర్లు ఇప్పుడు తెలంగాణలోని మద్యం దుకాణాలలో కనిపిస్తుండడంతో మద్యం ప్రియులు వాటి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఏపీ మాదిరిగా బూమ్ బూమ్ బీరు, ప్రెసిడెంట్ మెడల్ వంటి విస్కీలు ఎప్పుడు అడుగుపెడతాయో అని సెటైర్లు పేలుస్తుండడం విశేషం.