తెలంగాణలోని ఘోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదం సృష్టించారు. తాజాగా ఆయన.. తనకు బెదిరింపు కాల్స్ వచ్చా యని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కేంద్ర హోం శాఖకు, పర్సనల్‌గా అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తెలంగాణ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామంటూ.. బెదిరిస్తున్నారని.. ఆ కాల్స్ కూడా.. పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని ఆయన ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని తన పిర్యాదు తీసుకోవడం లేదని అన్నారు.
అందుకే కేంద్రానికి నేరుగా ఫిర్యాదు చేసినట్టు రాజా సింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్ చేస్తున్నవారు.. తాను ధర్మాన్ని వదిలేయాలని షరతు పెడుతున్నట్టు చెప్పారు. లేకపోతే..తనను తన కుటుంబాన్ని కూడా.. లేపేస్తామని దారుణంగా చంపేస్తామని హెచ్చరించినట్టు రాజా సింగ్ పేర్కొన్నారు. అయితే.. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా.. తాను ధర్మాన్ని వీడే ప్రశ్నే లేదని చెప్పారు. ధర్మం కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆయన భారీ వివాదం సృష్టించారు. తనను బెదిరిస్తూ.. అనేక మంది ఫోన్ చేస్తున్నట్టు చెప్పిన ఆయన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నెంబరు ఇచ్చినట్టు తెలిపారు.
“నన్ను,. నా కుటుంబాన్ని బెదిరిస్తూ.. పాకిస్థాన్ నుంచి ఫోన్లు వచ్చాయి. ధర్మాన్నివదిలేయాలని డిమాండ్ చేశారు. వదలనని చెప్పా. అదేసమయంలో నా దగ్గర ఎన్ని పోన్ నెంబర్లు ఉన్నాయని ప్రశ్నించారు. ఉన్నాయన్నా. వెంటనే రేవంత్ రెడ్డి ఫోన్ నెంబరు గుర్తుకు వచ్చింది. అది వారికిచ్చేశా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా బెదిరింపు ఫోన్లు వస్తాయి. అప్పుడు ఆయనకు నాబాధ తెలుస్తుంది. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఆయన అప్పటికైనా చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నా” అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వివాదానికి కేంద్రంగా కూడా మారనున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.