అధికారులు వెళ్లిపోతామంటున్నారు.. ఏంటి క‌థ‌!

Andhra Pradesh

వారంతా సీనియ‌ర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా వారంతా సీఎం జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయులు. ఆర్థిక‌, ఎక్సైజ్‌, గ‌నుల శాఖ‌ల అధిప‌తులుగా చ‌క్రం తిప్పారు. వైసీపీ అనుకూల కాంట్రాక్ట‌ర్ల‌కు కూడా మేలు చేశార‌నే విమ‌ర్శ‌లు బ‌లంగా ఎదుర్కొన్నారు.

నిత్యం ప్ర‌తిప‌క్షాల నుంచి అనేక ఈస‌డింపులు ఎదురైనా.. నాలుగేళ్ల‌పాటు వాటిని ఎదుర్కొన్నారు. సీఎం జ‌గ‌న్ ఏం చెబితే అది చేశారు. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే మెలిగారు. అనేక కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. మ‌రి ఇంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇప్పుడు వెళ్లిపోతామ‌ని చెబుతున్నారు.

దీంతో ఏపీలో ఏం జ‌రుగుతోంద‌న్న వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. సీఎం జ‌గ‌న్ కోట‌రీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల్లో షంషేర్ సింగ్ రావ‌త్ కీల‌కం. ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించ‌డంలోనూ.. అప్పులు చేసైనా.. ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలోనూ రావ‌త్ కీల‌క పాత్ర పోషించారు. సీఎం జ‌గ‌న్ ఎంత చెబితే.. అంత సొమ్మును ఏదో ఒక రూపంలో కేంద్రాన్ని ఒప్పించి.. ఆర్బీఐని సైతం ఒప్పించి తెచ్చారు. అలాంటి అధికారి.. ఇప్పుడు రాష్ట్రం నుంచి తెలంగాణ‌కు వెళ్లిపోతాన‌ని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అదేవిధంగా గ‌నుల వ్య‌వ‌హారంలో హైకోర్టు ఆదేశాల‌ను కూడా తోసిపుచ్చి.. స‌ర్కారు చెప్పింది చేశారన్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న మ‌రో అధికారి వెంక‌ట‌రెడ్డి. ఈయ‌న గ‌త నాలుగేళ్లుగా సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ప‌నిచేశారు. మీడియాలో వ‌చ్చిన వ్య‌తిరేక వార్త‌ల‌ను కూడా అప్ప‌టిక‌ప్పుడు ఖండించారు. ఇదే ప‌నిగా పెట్టుకున్నారా? అని ఒక‌ప్పుడు దుయ్య‌బ‌ట్టారు. అంత వీర విధేయ‌త ప్ర‌ద‌ర్శించిన వెంక‌ట రెడ్డి రాష్ట్రంలో ఉండలేన‌ని చెబుతున్నారు. త‌న‌ను బ‌దిలీ చేయాల‌ని.. లేదా వేరే రాష్ట్రానికైనా పంపేయాల‌ని కోరుతున్నారు.

మ‌రో ముఖ్య అధికారి వాసుదేవ రెడ్డి. రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాలను పెంచ‌డంలోనూ.. ధ‌ర‌ల‌ను పెంచి చీపు లిక్క‌రును పారించ‌డంలోనూ.. ఈయ‌న పాత్ర‌పై విప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. అంతేకాదు.. వైసీపీ నాయ‌కులు త‌మ చెప్పు చేత ల్లో ఉన్న బేవ‌రేజెస్ నుంచి మ‌ద్యాన్నికొనుగోలు చేయ‌డ‌లోనూ వాసుదేవ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇలాంటిఈయ‌న కూడా ఇప్పుడు ఉండ‌లేను బాబోయ్ అనేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే.. ఎక్క‌డో తేడా కొడుతోంద‌న్న సంకేతాలు.. వీరికి అంది ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. రేపు ప్ర‌భుత్వం మారితే.. వీరి ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో ప‌డుతుంద‌న్న భ‌యంతో నే ఇప్పుడు త‌మ త‌మ స్థానాలు వ‌దులుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న చ‌ర్చ ఐఏఎస్ వ‌ర్గాల్లో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.