ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం శాసనసభ స్థానం నుండి బరిలోకి దిగాడు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. జనసేన తరపున మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు పిఠాపురం గ్రామాలలో సందడి చేశారు. వైసీపీ తరపున రోజా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో జబర్దస్త్ నటుల కౌంటర్లు సీనియర్ రాజకీయ నాయకుల విమర్శలను తలపించాయి.
పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 75 వేలు ఉంటాయని అంచనా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏకపక్ష విజయం సాధిస్తాడా ? వంగా గీత జనసేన అధినేత పవన్ గెలుపును అడ్డుకోగలిగేంత సత్తా ఉందా ? అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. ప్రచారం చివరిరోజు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వంగాగీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు.
అయితే ఇంకా ఫలితాలకు కొద్దిరోజులు మిగిలి ఉండగానే పిఠాపురం జనసేన, వైసీపీ శ్రేణుల పిచ్చి పీక్స్ కు చేరింది. జనసేన అభిమానులు అప్పుడు ‘మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్’ అన్న స్టిక్కర్లు తమ వాహనాలకు తగిలించుకుని తిరుగుతున్నారు. తాము మాత్రం తక్కువ తిన్నామా అంటూ వైసీపీ అభిమానులు తమ వాహనాలకు ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అన్న స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇది చూసిన జనం ‘ఆలు లేదు .. చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates