ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ (నరసాపురం) రఘురామ కృష్ణంరాజు.. తనను విమర్శించి నాయకులకు మరోసారి తనదైన శైలిలో బదులిచ్చారు. తన తోలు తీస్తామంటూ వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘నా తోలు తీస్తామంటూ కొందరు నాయకులు మాట్లాడతారు. కానీ నేనలా మాట్లాడలేను. ఎందుకంటే తోలు తీయడం నా వృత్తి కాదు. అలా మాట్లాడుతున్న వాళ్లు బహుభాషా కోవిదులు. నాకు అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా… నా అంతరంగంలో మాట్లాడతాను కానీ.. బహిరంగంగా ఆ భాష వాడను. ప్రజలు అసహ్యించుకొనేలా … ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం ఉన్నారు. వాళ్లు నా మాట వినండి. అలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు నాకున్నారు’’ అని రఘురామ అన్నారు.
తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్లకు మూణ్నాలుగు రోజుల్లో సరైన బదులు వస్తుందని అంత వరకు ఎదురు చూడాలని రఘురామ వ్యాఖ్యానించారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని.. తనను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారని.. రాయలసీమలో కూడా తనకు సన్నిహితులు, అభిమానులు ఉన్నారని.. కరోనా ప్రభావం తగ్గితే పది వేల మందితో పులివెందులలో కూడా సభ పెట్టగల దమ్ము తనకుందని ఆయన పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే పార్టీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.. కానీ తనను బహిష్కరించే దమ్ము మాత్రం వారికి లేదని చెప్పారు. తమ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారని.. న్యాయవ్యవస్థలను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోందని అన్న రఘురామ.. తనకు మాత్రం ఆ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని.. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ చిరంజీవులు అని ఆయన అన్నారు. అమరావతి రైతులు ఏమాత్రం భయపడొద్దని, వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని రఘురామ భరోసా ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates