తెలంగాణలో గతేడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికలూ ముగిశాయి. త్వరలో సర్పంచ్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇవే కాకుండా త్వరలోనే మరోసారి ఎమ్మెల్యే ఎన్నికలూ జరిగే అవకాశం ఉంది. అవును.. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలూ పోటీ చేశారు. వీళ్లు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు ఉప ఎన్నిక అనివార్యమవుతోంది.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి టఫ్ ఫైట్ నడిచింది. బీజేపీ తరపున కిషన్ రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో దిగారు. దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ఇద్దరూ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి నాగేందర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీళ్లిద్దరిలో ఎవరు ఎంపీగా గెలిచినా ఆయా శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పదు.
ఈ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు గెలిచి లోక్‌సభ వెళ్లాలని నిర్ణయించుకుంటే అప్పుడు శాసనసభకు రాజీనామా చేయాలి. దీంతో ఆరు నెలల్లోపు ఆ శాసనభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ సిటింగ్ ఎంపీగా ఉన్న కిషన్‌రెడ్డి విజయంపై ధీమాతో ఉన్నారు. పైగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కూడా కావడంతో ఆయనకు ఈ గెలుపు అత్యవసరం. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కచ్చితంగా విజయం తనదేనని నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.