ఆ ఇద్ద‌రే మాట్లాడుతున్నారు.. మిగ‌తా బీఆర్ఎస్ నేత‌లు ఎక్క‌డా?

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయాల‌న్నా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌న్నా.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలో ప్ర‌ధానంగా ఇద్ద‌రు నేత‌లే క‌నిపిస్తున్నారు. త‌మ పార్టీపై కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కూ వీళ్లే కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఆ ఇద్ద‌రే.. కేటీఆర్‌, హ‌రీష్ రావు. ఇప్పుడు పేప‌ర్ల‌లో, ఛానెళ్ల‌లో, సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రే క‌నిపిస్తున్నారు. మ‌రి మిగ‌తా బీఆర్ఎస్ నేత‌లు ఎక్క‌డా? అంటే స‌మాధానం మాత్రం దొర‌క‌డం లేదు.

ప్ర‌తిప‌క్షంలో ఏ పార్టీ ఉన్నా స‌రే అది ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించాలి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అధికారంలోని ప్ర‌భుత్వంతో కొట్లాడాలి. అన్యాయాలు, అక్ర‌మాల‌పై ప్ర‌శ్నించాలి. ఇప్పుడు తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గ‌తంలో రెండు సార్లు గ‌ద్దెనెక్కిన బీఆర్ఎస్ ఈ సారి ప్ర‌తిప‌క్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగే దిశ‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ప్ర‌శ్నించాల్సిందే. కానీ ఆ పార్టీలో కేటీఆర్‌, హ‌రీష్ రావుల గొంతు మాత్ర‌మే ప్ర‌స్తుతం వినిపిస్తోంది. స‌న్న‌పు వ‌డ్ల‌కే బోన‌స్ రూ.500 ఇస్తామ‌నే కాంగ్రెస్ ప్ర‌క‌ట‌న‌పై, క‌రెంట్ కోత‌ల‌పై, వ‌డ్ల కొనుగోళ్ల‌పై, కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై, టిమ్స్ ఆసుప‌త్రుల నిర్మాణంపై ఈ బావ‌బావ‌మ‌రుదులే ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. కానీ మ‌రే నాయ‌కుడు కూడా గొంతు మెద‌ప‌డం లేదు.

అస‌లు మిగ‌తా బీఆర్ఎస్ నాయ‌కులకు ఏమైంది. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు ప్ర‌త్యేకంగా బీఆర్ఎస్ నేత‌లు ప్రెస్‌మీట్లు పెట్టేవాళ్లు. శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌, త‌ల‌సాని శ్రీనివాస్‌యాద‌వ్, మ‌ల్లారెడ్డి, జీవ‌న్‌రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి, స‌బితా త‌దిత‌ర నాయ‌కులు త‌ర‌చూ విలేక‌ర్ల ముందుకు వ‌చ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ఏ ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల లోక్‌స‌భ ప్ర‌చారంలోనూ వీళ్లు అంతంత‌మాత్రంగానే పాల్గొన్నారు. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మితో వీళ్లు సైలెంట్ అయిపోయార‌నే టాక్ ఉంది. కాంగ్రెస్‌ను ప్ర‌శ్నిస్తే ఎక్క‌డ త‌మ‌ను టార్గెట్ చేస్తారేమోన‌నే భ‌యం క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా కాంగ్రెస్‌తోనూ బీఆర్ఎస్ నేత‌లు ట‌చ్‌లో ఉన్నార‌ని తెలిసింది. అందుకే వీళ్ల‌లో కొంత‌మంది కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల జోలికి వెళ్ల‌డం లేద‌ని స‌మాచారం.