పరువు నిలిపే వారసులు ఎవరు ?

ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వారి వారసులు ఎనిమిది మంది ఈ ఎన్నికలలో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009లో కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున గెలిచాడు. వైఎస్ మరణం అనంతరం 2010 డిసెంబరులో ఎంపీ పదవికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాడు. 2014, 2019 ఎన్నికలలో పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి మళ్లీ అక్కడి నుండి పోటీ చేస్తున్నాడు.

ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ 2014, 2019 ఎన్నికలలో అనంతపురం జిల్లా హిందూపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. మరోసారి అక్కడి నుండి పోటీ చేస్తున్నాడు. హిందూపురం టీడీపీ కంచుకోట. 1985 నుండి 1994 వరకు ఎన్టీఆర్ ఇక్కడ వరసగా విజయం సాధించాడు. 1996 ఉప ఎన్నికలలో హరికృష్ణ పోటీ చేసి గెలిచాడు.

నందమూరి కుటుంబ మరో వారసురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 2004లో కాంగ్రెస్ పార్టీ నుండి బాపట్ల ఎంపీగా, 2009లో విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరుల శాఖా మంత్రిగా పనిచేసింది. కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా 2014లో బీజేపీలో చేరి రాజంపేట లోక్ సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. గత ఏడాది జులై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా బీజేపీ తరపున పోటీ చేసింది.

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 2019 ఎన్నికలల్లో తొలిసారి గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి ఈసారి అక్కడి నుండే పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈసారి అక్కడ ఆయన గెలుపు తప్పనిసరిగా మారింది.

ఉమ్మడి రాష్ట్రంలో నెల రోజులు ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన కుమారుడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. 2004, 2009 ఎన్నికలలో తెనాలి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. 2018లో జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఈసారి తిరిగి తెనాలి నుండి జనసేన తరపున పోటీ చేస్తున్నాడు.

మరో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా గెలిచి కేంద్రంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశాడు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం డోన్ శాసనసభ స్థానం నుండి పోటీ చేస్తున్నాడు.

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి కుమారుడు రాంకుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో వెంకటగిరి శాసనసభ స్థానం నుండి రాజకీయ అరంగేట్రం చేశాడు.

ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల అన్నతో విభేధించి తెలంగాణకు వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. అక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండానే దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తొలిసారి ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. అక్కడ తన సోదరుడు అవినాష్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేసిన షర్మిల ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచిచూడాలి.