ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేక ధోరణి ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నా తమకు అలవాటుగా వచ్చే తీరును మార్చుకోవటం అంత తేలిక కాదు. తమ తీరు వల్ల తమకు చెడ్డపేరు వస్తుందని తెలుసుకొని తమను తాము మార్చుకునే వాళ్లు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. తప్పును ప్రస్తావించినా ఊరుకోలేరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే కోవకు చెందుతారని చెబుతారు.
ఆయన అంచనాలు తప్పుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించరని..ఒకవేళ ఎవరైనా ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆగ్రహానికి గురవుతారని చెబుతారు. అందుకే.. అధినేతకు నచ్చిన మాటనే తప్పించి.. తేడా మాటను చెప్పే సాహసం చేయరని చెబుతారు.
ఎవరైనా ఒకరిద్దరూ ఆ ధైర్యం చేస్తే..వారికి మళ్లీ జగన్ ను కలిసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతారని చెబుతారు. పోలింగ్ ముగిసి.. గెలుపు ఎవరిదన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపిస్తున్న వేళ.. మరోసారి అధికారం ఖాయమన్న ధీమాను జగన్ అండ్ కో వ్యక్తం చేయటం తెలిసిందే.
ఈ అంశానికి సంబంధించి గతంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటల్ని ప్రస్తావిస్తున్నారు. 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి మాదిరే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన గెలుపు మీద ధీమాగా ఉండేవారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కూటమి బలంగా ఉందన్న అభిప్రాయాన్ని దరి చేరనివ్వకుండా చేసిన ఆయన.. చివరకు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే తేదీని సైతం సిద్ధం చేసుకోవటాన్ని గుర్తు చేస్తున్నారు. చివరకు తన కాన్వాయ్ లో ఎన్ని వాహనాలు ఉండాలి? ఏ రంగు వాహనాలు ఉండాలన్న దానిపైనా డిసైడ్ అయిన వైనం గురించి తెలిసిన వారు విస్మయానికి గురయ్యారు.
అంతేనా.. తాను సీఎం అవుతున్నానని.. తన టీంలో ఎవరెవరు ఉండాలన్న దానిపైనా కసరత్తు చేయటం.. దానికి సంబంధించిన జాబితాలు సిద్ధం చేసుకొని రెఢీగా ఉంచుకోవటం చూసిన వారంతా ఆలూ లేదు చూలు లేదన్న సామెతను గుర్తు చేసుకున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తీవ్రమైన మనస్తాపానికి గురైన జగన్.. ఎవరిని కలిసేందుకు సైతం ఇష్టపడని రోజల్ని గుర్తు చేస్తున్నారు. సర్వేలు.. కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు.. పీకే లాంటోళ్లు తమ అంచనాల్ని చెబుతున్నా జగన్ పట్టించుకోని తీరుపై ఆశ్చర్యం అక్కర్లేదని.. ఆయన తీరే అలా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2014లో జగన్ తీరు ఎలా ఉందో.. 2024లోనూ అలాంటి తీరే ఆయన ప్రదర్శిస్తున్న వైనాన్ని మర్చిపోకూడదంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది జూన్ 4న తేలిపోనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates