క్రాస్ ఫైరింగ్ ఎవరికి తగిలేను ?!

ఏపీలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు ఏకకాలంలో జరిగిన పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ బెడద అభ్యర్థులను వణికిస్తున్నది. ఓటర్ల క్రాస్ ఫైరింగ్ కు బలయ్యే అభ్యర్థులు ఎవరు అన్న చర్చ జోరుగా నడుస్తున్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నంధ్యాల పార్లమెంటు స్థానాలలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.

శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడుకు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు, విశాఖలో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ కు, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు, నంధ్యాలలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి ఈ క్రాస్ ఓటింగ్ కలిసి వచ్చినట్లు చెబుతున్నారు.

ఎంపీకి ఒక పార్టీకి, ఎమ్మెల్యేకు ఒకపార్టీకి ఓటు వేసి ఓటర్లు అందరికీ సమన్యాయం చేసినట్లు భావిస్తున్నారని అంటున్నారు. ఈ ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఓటర్లు భిన్నంగా వ్యవహరించారని ఈ లెక్క ప్రకారం జూన్ 4న ఫలితాలు అనూహ్యంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నంధ్యాల స్థానాల నుండి ఎంపీలుగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు బొత్స ఝాన్సీ, పేరాడ తిలక్, ముత్యాల నాయుడు, చంద్ర శేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డిలు ప్రస్తుతం డైలామాలో పడినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విజయం ఖాయం అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ క్రాస్ ఓటింగ్ అందరికి గుబులు రేపుతున్నది.