కడప జిల్లా జమ్మలమడుగులో ఈసారి గెలుపు ఎవరిది ? అన్న చర్చ జోరుగా నడుస్తుంది. ఇక్కడి ఫలితాల మీద అంచనాలు అందక బెట్టింగ్ రాయుళ్లు కూడా భయపడి వెనక్కు తగ్గుతున్నారంటే ఇక్కడ పోటీ ఎలా జరిగిందో అంచనా వేయవచ్చు. వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి, కూటమి పొత్తులో భాగంగా బీజేపీ నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు పోటీకి దిగారు.
ఆదినారాయణ రెడ్డి 2004, 2009 ఎన్నికలలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున, 2014 ఎన్నికలలో వైసీపీ తరపున విభజిత ఆంధ్రప్రదేశ్ లో వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా జమ్మలమడుగు స్థానం నుండి పోటీ చేసి గెలిచాడు. 2014లో గెలిచిన తర్వాత జగన్ తో విభేధించి 2016లో టీడీపీలో చేరాడు.
అనంతరం 2017 నుండి 2019 వరకు మార్కెటింగ్ & గిడ్డంగులు, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ మరియు సహకార శాఖా మంత్రిగా పనిచేశాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కొన్నాళ్లకే ఆయన బీజేపీ పార్టీలో చేరిపోయి ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. మూడుసార్లు గెలిచిన నియోజకవర్గం కావడంతో ఆయన గట్టిపోటీని ఇచ్చాడని అంటున్నారు.
వైసీపీ తరపున గత ఎన్నికల్లో విజయం సాధించిన సుధీర్ రెడ్డి తిరిగి బరిలో ఉన్నాడు. గత ఎన్నికల్లో ఆయన 50 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించాడు. వైఎస్ కుటుంబ ప్రభావం అధికంగా ఉండే జమ్మలమడుగులో మరోసారి విజయం ఖాయం అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. 1994, 1999 ఎన్నికల్లో వరసగా రెండు సార్లు టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఆ తర్వాత 2004 నుండి ఈ స్థానంలో ఓటమిపాలవుతూ వస్తున్నాడు.
ఎర్రగుంట్ల, ముద్దనూరు, పెద్దముడియం మండలాలలో వైసీపీ, జమ్మలమడుగు, కొండాపురం, మైలవరం మండలాలలో బీజేపీకి మెజారిటీ వస్తుందని అంచనాలు వేస్తున్నారు. చెరి మూడు మండలాలు పార్టీలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఎవరూ గెలుపు మీద ఒక అంచానాలకు రాలేకపోతున్నారు. అయితే కమలం పువ్వు గుర్తు ఎంత వరకు ప్రజల్లోకి వెళ్లింది అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.