మాచ‌ర్ల ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ఆందోళ‌న‌.. ఫోన్ చేసి ఆరా!

ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి సృష్టించిన అరాచ‌కంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఇది దిగ‌జారుడు త‌న‌మ‌ని వ్యాఖ్యానించారు. వైసీపీ మూక‌లు ఇలాంటి అఘాయిత్యాల‌కు పాల్ప‌డ‌తాయ‌ని తాము ముందు నుంచి హెచ్చ‌రిస్తూనే ఉన్నామ‌న్నారు. స్థానిక పోలీసులు త‌మ హెచ్చ‌రిక‌ల‌ను లైట్ తీసుకున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించా రు. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అయినా.. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

ఈ మేర‌కు విదేశాల నుంచి మాచ‌ర్ల‌లోని పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేష‌గిరితో చంద్ర‌బాబు ఫోన్‌లో మాట్లాడారు. పోలింగ్ రోజు.. పిన్నెల్లి దౌర్జ‌న్యంగా పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్‌లోకి ప్ర‌వేశించ‌డం..ఈవీఎంను, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన విష‌యం వీడియోల రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేష‌గిరి.. ఎమ్మెల్యే పిన్నెల్లిని ధైర్యంగా ఎదిరించారు. అయితే.. నంబూరిని పిన్నెల్లి హెచ్చ‌రించారు. ఇది కూడా వీడియోల్లో రికార్డ‌యింది. ఈ నేప‌థ్యంలో నంబూరిపై త‌ర్వాత పిన్నెల్లి అనుచ‌రులు దాడుల‌కు పాల్ప‌డ్డారు.

దీంతో నంబూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకుని పిన్నెల్లిని అరెస్టు చేయాల‌ని ఆదేశించిన ద‌రిమిలా.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు విదేశాల నుంచి నంబూరితో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని.. ఎలాంటి భ‌యం అవ‌స‌రం లేద‌ని.. పేర్కొన్నారు. పార్టీ త‌ర‌ఫున ఏజెంట్ గా ఉంటూ.. పిన్నెల్లిని ఎదిరించిన తీరును ఆయ‌న అభినందించారు. పార్టీకోసం.. క‌ష్ట‌ప‌డే వారికి గుర్తింపు ఉంటుంద‌ని.. ఎలాంటి అధైర్యం పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. హైద‌రాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవాల‌ని.. పార్టీ స‌హ‌క‌రిస్తుంద‌ని నంబూరికి చంద్ర‌బాబు అభ‌యం ఇచ్చారు.