సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు ఎగ‌బ‌డుతున్న ప‌రిస్థితి ఉంది. ఇప్పుడు 135 ఏళ్ల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంటు వైపు అడుగులు వేసింది. తాజాగా ఆ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు, మాజీ చీఫ్‌.. సోనియాగాంధీ కూడా సెంటిమెంటు బాంబునే పేల్చారు. ప్ర‌స్తుతం ఆమె పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌న్న విష‌యం తెలిసిందే. కొన్నాళ్ల కింద‌ట రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. దీంతో ఖాళీ అయిన సోనియాగాంధీ స్థానాన్ని(రాయ‌బ‌రేలి) ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎంచుకున్నారు.

యూపీలోని రాయ‌బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాహుల్ గాంధీ తొలిసారిపోటీ చేస్తున్నారు(ఈ నియోజ‌క‌వ‌ర్గంలో). దీంతో సోనియా గాంధీ శుక్ర‌వారం ఇక్క‌డ ప‌ర్య‌టించి.. త‌న కుమారుడిని నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిచ‌యం చేశారు. త‌న కుమారుడిని ఆదుకోవాల్సింది.. మీరే నంటూ ఆమె సెంటిమెంటు డైలాగులు పేల్చారు. త‌న కుమారుడిని ఇక్క‌డి ప్ర‌జ‌ల‌చేతుల్లో పెడుతున్న‌ట్టు చెప్పారు. సుదీర్ఘ కాలంగా త‌న‌ను ఇక్క‌డ ప్ర‌జ‌లు, ఓట‌ర్లు ఆద‌రిస్తున్నార‌ని.. త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇక్క‌డ పోటీ చేయ‌డం లేద‌ని.. ఆమె మ‌రో సెంటిమెంటు ముక్క విసిరారు. దీంతో త‌న కుమారుడిని ఇక్క‌డ బ‌రిలో నిలిపిన‌ట్టు సోనియాగాంధీ చెప్పుకొచ్చారు.

రాహుల్‌ను ఆశీర్వ‌దించాల‌ని కూడా సొనియాగాంధీ పిలుపునిచ్చారు. అయితే.. ఈ సెంటిమెంటు ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తుంద‌న్న‌ది ప్ర‌శ్న‌. 2004 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సోనియాగాంధీ వ‌రుస‌గా రాయ‌బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. చిత్రం ఏంటంటే.. ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారానికి త‌ప్ప‌.. ఇన్నేళ్ల‌లో ఏ నాడూ కూడా నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోవ‌డం విశేషం. కానీ, ఇక్క‌డ అభివృద్ది కార్య‌క్ర‌మాలు మాత్రం జ‌రిగాయి. ఇదే విష‌యాన్ని తాజాగా సోనియా చెప్పుకొచ్చారు. 2019లో ఒక్క‌సారి మాత్ర‌మే తాను వ‌చ్చాన‌ని.. అయినా ఇది త‌న‌కు పుట్టిల్లు లాంటింద‌ని చెబుతూ.. పుట్టిల్లుకు మేలు చేశాన‌ని మ‌రో సెంటిమెంటు అస్త్రం ప్ర‌యోగించారు. మొత్తంగా చూస్తే.. ఈ సెంటిమెంటు ఏమేర‌కు రాహుల్‌కు క‌లిసి వ‌స్తుంద‌నేది చూడాలి.