హింసపై కదిలిస్తున్న రొంపిచెర్ల వాసి ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో గతంలో ఎన్నికలు అంటే గ్రామాలు రణరంగంగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో నెలకొన్న హింసను చూసి గతంలో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాసిన కథనం అందరినీ కదిలిస్తుంది.

“ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తుకొస్తోంది. 1995-96 సమయంలో ఇంత కంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికలతో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్లను హీరోలుగా చూశాం. బడులు ఎగ్గొట్టి ఆడుకున్నాం. మేము తోపులం అని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలి అనింపించేది. కానీ తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. కొట్లాటలో కొంత మంది చేతులు, కాళ్లు విరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లల్లో సోదాలు చేసేవాళ్లు’’

‘‘అందరూ ఊరి చివర తోటల్లో ఉండే వాళ్లు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లల్లో ఆడవాళ్లు బాగా ఇబ్బంది పడేవాళ్లు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో, చాలా మంది పశువులనూ అమ్మేసుకున్నారు. పదోతరగతి పాసైనవారి నుంచి డిగ్రీ చేసిన వాళ్ల వరకూ ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యాయి’’

‘‘మనిషి ముందు హీరోలా చూసినా వెనక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునే వాళ్లు. ఒక తరమంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటుచూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనం అయ్యాయి. పల్నాటి కుర్రోళ్లకు ఒకటే చెబుతున్నా. గొడవలు పడకండి. ఈ రోజు మా ఉళ్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మీరు కొట్టుకుని నష్టపోకండి. ఇదీ మా ఊరి అనుభవం. మా ఊరు రొంపిచర్ల’’ అని పేర్కొన్నాడు.