‘సింగిల్ సింహం’ అని ఏ ముహూర్తాన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమాటిక్ డైలాగుని రాజకీయాల్లో చెప్పారో, అప్పటినుంచి.. ఆయనకి ఏదీ కలిసి రావడంలేదు.! తోడబుట్టిన చెల్లి, వైసీపీకి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది. చివరికి కన్న తల్లి కూడా, వైసీపీ ఓటమిని కోరుకుంటోంది.!
రాజకీయాల్లో అన్నదమ్ములు వేర్వేరు పార్టీలో వుండడం మామూలే. అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా రాజకీయంగా విభేదాలు వుండొచ్చు. కానీ, చెల్లెల్ని ఏడిపించిన ‘అన్న’ని ఎక్కడైనా చూశామా.? తనయుడి నుంచి ప్రాణభయంతో పారిపోయే తల్లిని చూశామా.? అన్న చర్చ ఓటర్లలో జరిగేంత స్థాయికి కుటుంబ రాజకీయాలు రోడ్డున పడలేదెప్పుడూ.!
వైఎస్ షర్మిల, కడప లోక్ సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తన కుమార్తె షర్మిలని గెలిపించాలంటూ విజయమ్మ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై వైసీపీ శ్రేణులు ‘బూతుల దాడి’కి దిగాయి. ఇదే వైసీపీకి పెద్ద సమస్యగా మారుతోంది.
‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు వైఎస్ షర్మిల..’ అంటూ ఓ వైసీపీ ప్రజా ప్రతినిథి గతంలో విమర్శించాక, షర్మిల పొలిటికల్ మైలేజ్ కడప జిల్లాలో అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు వైఎస్ విజయమ్మపై వైసీపీ శ్రేణుల ట్రోలింగ్‌తో కడప జిల్లాలో షర్మిల ఇమేజ్ మరింత బలపడినట్లు కనిపిస్తోంది.
కుమార్తె కోసం వీడియో విడుదల చేసినట్లే, కుమారుడి కోసం కూడా విజయమ్మ ఓ వీడియో విడుదల చేయడానికి అవకాశమైతే వుండేది. కానీ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు వైఎస్ జగన్.
‘నా పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా, నా ఫొటో చూసే ఓటు వేస్తారు తప్ప.. మా పార్టీ అభ్యర్థుల్ని చూసి ఎవరూ ఓటు వెయ్యరు..’ అని ఓ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ చెప్పడం, వైఎస్ జగన్ ‘సింగిల్ సింహం’ మనస్తత్వాన్ని చెప్పకనే చెబుతోంది.
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయమ్మ, షర్మిల ‘బలం’గా నిలిచారు.! ఇప్పుడు ఆ కుటుంబం జగన్ వెంట లేదు. జగన్ ఒంటరి.. అనే సింపతీ లేదెక్కడా. కుటుంబాన్ని దూరం చేసుకున్నాడన్న అపప్రధ మాత్రమే మిగిలింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates