సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మీద ఉన్న ఈ టోల్ గేట్ వద్ద రద్దీ ఏర్పడి ప్రతి సారి గంటల తరబడి వేల వాహనాలు జామ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఓట్ల పండుగ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా మరోసారి ప్యాక్ అయింది.
ఈ నెల 13 న ఏపీలో అసెంబ్లీ ,లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఆంధ్రా ఓటర్లు తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్తుండడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా ఓట్లేయడానికి బయల్దేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.
టోల్ గేట్ చెల్లింపునకు వాహనాలు బారులు తీరడంతో పంతంగి నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా కదులుకుండటంతో హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నది. శుక్రవారం రాత్రి నుంచే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.
ఎన్నికల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఏపీకి 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు, జేబీఎస్ బస్టాండ్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. దీంతో పాటు 58 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్నది.