ఏపీలో ఏం జ‌రుగుతోంది.. నిమ్మ‌గ‌డ్డకు టెన్ష‌న్ ఎందుకు?

ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యేందుకు మ‌రికొద్ది గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ.. ఇంత‌లోనే ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే టెన్ష‌న్ క‌నిపిస్తోంది. గ‌త రాత్రి(శుక్ర‌వారం) నుంచి ప‌లు జిల్లాల్లో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీలో ఏదో జ‌రుగుతోంద‌నే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎన్నిక‌ల అధికారి, సిటిజ‌న్ ఫ‌ర్ డెమొక్ర‌సీ కార్య‌ద‌ర్శి.. నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ మ‌రింత ఎక్కువ‌గా ఆందోళ‌న జ‌రుగుతోంది. దీంతో రాజ‌కీయంగా టెన్ష‌న్ పెరిగింది.

ఏం జ‌రుగుతోంది?

ప‌ల్నాడు.. స‌హా సీమ‌లోని చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో పోలీసులు శుక్ర‌వారం రాత్రి నుంచి ఇళ్ల‌లో సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా స‌స్పెక్ట్ షీట్లు ఉన్న‌వారిని.. అనుమానాస్ప‌దం అని ముద్ర ప‌డిన వారిని.. గ‌తంలో బైండోవ‌ర్ కేసులు న‌మోదైన వారిని పోలీసులు స్టేష‌న్ల‌కు పిలుస్తున్నారు. వీరితో సంత‌కా లు చేయించుకుంటున్నారు. దీనికి కార‌ణం.. సోమ‌వారం జ‌ర‌గ‌నున్న పోలింగ్‌లో వీరు ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌కుండా చూసేందుకునేని అంద‌రికీ తెలిసిందే.

కానీ.. ఇక్క‌డే అస‌లు చిక్కు వ‌చ్చింది. పోలీసులు స్టేష‌న్ల‌ను పిలుస్తున్న‌వారిలో అధికార పార్టీ నాయ‌కుల కు బ‌దులుగా.. ప్ర‌తిప‌క్ష టీడీపీ కి చెందిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. ఇదే టెన్ష‌న్‌కు కార‌ణ‌మైంది. ఈ విష‌యాన్నే కోట్ చేస్తూ.. నిమ్మ‌గ‌డ్డ‌ర‌మేష్ కుమార్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తిప‌క్షాల‌ను నిలువ‌రించి.. వైసీపీ కుట్ర‌లు చేస్తోంద‌న్న కోణంలో నిమ్మ‌గ‌డ్డ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై తాము ఇప్ప‌టికే డీజీపీ, ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేసినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు.  

మ‌రి ఈయ‌న అనుమానిస్తున్న‌ట్టు ఎన్నిక‌ల పోలింగ్‌ను ఏక‌ప‌క్షం చేసేందుకే ఇలా చేస్తున్నారా? అనే ప్ర‌శ్న వ‌స్తుంది. స‌హ‌జంగా కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. అనుమానితుల అడుగు జాడ‌ల‌పై నిఘా ఉంచాల‌నేది ఎన్నిక‌ల సంఘం కూడా చెబుతున్న మాట‌. ఈక్ర‌మంలోనే తాము వారిని పిలిచి.. సంత‌కాలు చేయించుకుంటున్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు. మ‌రి దీనిపై టీడీపీ అధినేత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.