వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు సొంత జిల్లా కడపలోనే షాక్ తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఈ సారి ఓటమి తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జగన్‌ను కలవరపెడుతోందని తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్‌కు సొంతగడ్డపైనే భంగపాటు కలిగే అవకాశముంది.
ఈ ఎన్నికల్లో విజయం కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అంజాద్ బాషాకు ఓటమి తప్పేలా లేదు. ఈ ఎన్నికలను ఆయన లైట్‌గా తీసుకోవడంతో గట్టి దెబ్బ పడే అవకాశముందని అంటున్నారు. ఆయన తీరుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. అయిదేళ్లో అంజాద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు అడ్డగోలుగా దోచుకున్నారని, కానీ ఎన్నికల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన తమ్ముడి వైఖరితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్‌ను కూడా చూడకుండా ఈ సారి అంజాద్‌ను ఓడించడమే లక్ష్యంగా జనాలు ఉన్నారని తెలిసింది. ఆయనపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ముస్లింలలోనూ అంజాద్‌పై వ్యతిరేకత ఉందని టాక్. ఎప్పటినుంచో అంజాద్ కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని జగన్‌కు వైసీపీ నాయకులు ఎంత చెప్పినా పట్టించుకోలేదని తెలిసింది. 2014, 2019 ఎన్నికల్లో అంజాద్ గెలిచారు. ఈ సారి టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవి రెడ్డి, కాంగ్రెస్ నుంచి అస్జల్ అలీఖాన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ముస్లిం లీడర్ కావడం, ఇక టీడీపీ నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో వైసీపీకి పరాజయమే మిగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.