ఒక‌టి జ‌గ‌న్‌కు.. ఒక‌టి ష‌ర్మిల‌కు.. అవినాష్‌కు సున్నా

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి క‌థ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అత‌ను కోల్పోవాల్సిందేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని వైఎస్ అభిమానులు రెండుగా చీలిపోవ‌డమే అందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీకి ఓటు వేయాల‌ని అనుకుంటున్న అక్క‌డి జ‌నాలు.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఓటును వైఎస్ ష‌ర్మిల‌కు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఒక‌టి అసెంబ్లీకి, మ‌రొక‌టి లోక్‌స‌భ‌కు ఇలా రెండు ఓట్లు వేసే అవ‌కాశం ఉన్న క‌డ‌ప పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ఒక‌టి, ష‌ర్మిల‌కు ఒక‌టి వేసేందుకు మొగ్గు చూపే ఆస్కార‌ముంది.

క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తూ అవినాష్‌ను ఓడించి విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ష‌ర్మిల సాగుతున్నారు. వివేకా హ‌త్య కేసును ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ అవినాష్‌పై ఆమె మాట‌ల తూటాలు విసురుతున్నారు. రాజ‌న్న బిడ్డ‌ను ఆద‌రించాల‌ని కోరుతున్నారు. దీంతో ఆమె ప్ర‌చారానికి ఇక్క‌డ మంచి స్పంద‌న వ‌స్తోంది. ఆమె పోరాటం గురించి ప్ర‌తి ఇంట్లోనూ చ‌ర్చ సాగుతోంద‌ని తెలిసింది. వైసీపీకి వీర విధేయులైన నాయ‌కులు కూడా వైఎస్ త‌న‌య‌కు అన్యాయం చేయ‌డం ఎందుకు? ఓ ఓటు వేద్దాం అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌మాచారం.

పులివెందుల‌లో జ‌గ‌న్‌కు ఓటు వేసే జ‌నాలు.. పార్ల‌మెంట్ స్థానానికి వ‌చ్చే స‌రికి ష‌ర్మిలకు ఓటు వేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ విధంగా చూస్తే పులివెందుల‌లో అవినాష్ కంటే ష‌ర్మిల‌కే ఎక్కువ ఓట్లు వ‌చ్చే ఆస్కార‌ముంది. అలాగే వివేకానంద‌రెడ్డి ప్ర‌భావం ఉన్న జ‌మ్మ‌ల‌మ‌డుగులోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. అక్క‌డ కూడా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అవినాష్‌ను కాద‌ని ష‌ర్మిల‌కే ఓటు వేసే అవ‌కాశం ఉంది. ఇలా చూసుకుంటే క‌డ‌ప లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో అవినాష్ ఓట‌మి ఖాయ‌మైంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ష‌ర్మిల విజ‌యానికి చేరువవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది.