పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో తెలిసిందే. పవన్‌ను పేరు పెట్టి పిలవకుండా ‘దత్తపుత్రుడు’ అనడం.. తానుఎక్కడ మాట్లాడుతున్నది కూడా చూసుకోకుండా స్కూల్ పిల్లలున్న సభల్లోనూ ఆయన పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడ్డం.. కార్లను మార్చినట్లు ప్రతి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడని కామెంట్లు చేయడం మామూలే.
తాజాగా జగన్ ఒక టీవీ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ అంశం చర్చకు వచ్చింది. పవన్‌ను ప్రతిసారీ పేరు పెట్టకుండా దత్తపుత్రుడు అని ఎందుకు అంటారు.. ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడతారు అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. దీనికి జగన్ ఏమని బదులిచ్చాడంటే..
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో పవన్ కళ్యాణ్ భాగమని.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు చేసిన పాలనలో కూడా అతను భాగమని.. అందుకే అతణ్ని తాను దత్తపుత్రుడు అంటానని జగన్ చెప్పారు.
ఇక పవన్ మీద చేసే వ్యక్తిగత కామెంట్ల గురించి మాట్లాడుతూ.. “రాజకీయాల్లో ఉన్నపుడు అందరికీ మనం కనిపిస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఒక రోల్ మోడల్‌గా, ఆదర్శవంతంగా ఉండాలి. నువ్వు ఐదేళ్లకొకసారి భార్యను మార్చి.. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఈ రకంగా నువ్వంతట నువ్వే ఐదేళ్లకోసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్‌గా తీసుకున్న వాళ్లు కూడా ఇదే మాదిరిగా చేస్తే వాళ్లూ చేయడం మొదలుపెడితే? ఒకసారి జరిగితే పొరపాటు.. రెండుసార్లు జరిగితే అది గ్రహపాటు.. మూడు, నాలుగుసార్లు జరిగితే అది అలవాటు” అని జగన్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates