అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. అద్దం పంపిస్తాను.. ముఖం చూసుకో అన్న‌య్యా! అంటూ .. ఆమె నిప్పులు చెరిగారు. శ‌నివారం మీడియాతో మాట్లాడిన షర్మిల‌.. మూడు కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. వీటికి స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌తి ప‌నినీ చంద్ర‌బాబుపైకి నెట్టేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇది నిజ‌మ‌నేలా ప్ర‌జ‌ల‌ను న‌మ్మిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ష‌ర్మిల పేర్కొన్న మూడు విష‌యాలు..

— చార్జిషీటులో వైఎస్ పేరు: సీఎం జ‌గ‌న్‌పై న‌మోదైన అక్ర‌మ ఆస్తుల వ్య‌వ‌హారానికి సంబంధించి న‌మోదైన కేసుల్లో వైఎస్ పేరును చేర్చార‌నేది ష‌ర్మిల ఆరోప‌ణ‌. అయితే.. దీనిని కాంగ్రెస్ పార్టీనే చేర్పించింద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. కానీ, ష‌ర్మిల మాత్రం ప్ర‌స్తుత ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్ స్వ‌యంగా వైఎస్ పేరును చేర్పించార‌ని.. కోర్టుల చుట్టూ తిరిగి ఆయ‌న వైఎస్ పేరును ప‌ట్టుబ‌ట్టి చేర్పించార‌ని అన్నారు. దీనికి కార‌ణం జ‌గ‌నేన‌ని చెప్పారు. క‌న్న తండ్రి పేరును చేర్పించిన జ‌గ‌న్‌ను ఎలా న‌మ్మాల‌ని ప్ర‌శ్నించారు. ఇలా వైఎస్ పేరును చేర్చించిన న్యాయ‌వాదికి ఏఏజీగా అవ‌కాశం ఇచ్చార‌ని చెప్పారు. ఇది నిజ‌మా కాదా.. చెప్పాల‌న్నారు.

— వివేకాహ‌త్య‌కు చంద్ర‌బాబు కార‌ణం: వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు గురైన రోజు జ‌గ‌న్ త‌న మీడియాలో నారాసుర రక్త చ‌రిత్ర అని ప్ర‌చారం చేయించార‌ని.. కానీ, ఇది నిజం కాద‌ని తేలిపోయింద‌ని ష‌ర్మిల అన్నారు. ఆనాడు అలాఎందుకు ప్ర‌చారం చేశార‌ని నిల‌దీశారు. ఏదో ఒక ర‌కంగా చంద్ర‌బాబుపై ఈ కేసును నెట్టేయాల‌ని చూసింది నిజం కాదా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఈ కేసును ముందు సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌న్న జ‌గ‌న్‌.. త‌ర్వాత‌.. ఎందుకు సీబీఐని వ‌ద్ద‌న్నారో చెప్పాల‌న్నారు. దీనికి స‌మాధానం ఉందా? అని ప్ర‌శ్నించారు.

— సునీత‌, ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు: తండ్రి కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె సునీత‌, త‌న బాబాయికి న్యాయం కావాల‌ని కోరుతున్న ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని ప్ర‌చారం చేస్తున్న జ‌గ‌న్‌.. దీనిని నిరూపించ‌గ‌ల‌రా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేర‌డం వెనుక కూడా.. చంద్ర‌బాబు ఉన్నార‌ని ఆరోపిస్తున్నార‌ని.. ఇదే నిజ‌మైతే.. గ‌తంలో ఓదార్పు యాత్ర‌లు, బైబై బాబు వంటి పాద‌యాత్ర‌లు చేసింది కూడా.. ఆయ‌న చెప్పిన‌ట్టుగానేనా? అని ప్ర‌శ్నించారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. జ‌గ‌న్ మాన‌సిక స్థితి స‌రిగా లేద‌ని నిప్పులు చెరిగారు. నీకు అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో.. అది నీదో కాదో చంద్ర‌బాబు క‌నిపిస్తున్నారో.. తేల్చుకో అంటూ ష‌ర్మిల వ్యాఖ్యానించారు.