బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న ఆయనకు తెలంగాణలోనే అధికారం లేకుండా పోయింది. అన్నీ తానే అనుకుని, పార్టీకి ఎలాంటి వ్యూహకర్తల అవసరం లేదని బీరాలు పలికిన కేసీఆర్కు షాక్ తగిలింది. ఇప్పుడు అర్జెంట్‌గా ఆ పార్టీకి ఓ వ్యూహకర్త అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ప్రతి పార్టీకి ఓ వ్యూహకర్త ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలను ఆ వ్యూహకర్తలు సిద్ధం చేస్తున్నారు. సునీల్ కనుగోలు వ్యూహాలతో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డే అని రేవంత్ రెడ్డి ఆ నమూనాను ప్రదర్శించడం వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
దీంతో లోకసభ ఎన్నికల తెలంగాణ పోరులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉందనేలా పరిస్థితి మారింది. బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు దక్కినా ఎక్కువే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ పంథా మార్చడం లేదు. అదే పాత చింతకాయ పచ్చడి తరహా ప్రచారం, స్పీచ్‌లతో సాగుతున్నారు. దీంతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. గతంలో ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తంగా ఎంచుకున్న తర్వాత కేసీఆర్ వద్దనుకున్నారు. అంతా తానే చూసుకుంటా అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ అదే వైఖరితో సాగుతున్నారు. ఇలాగే ఉంటే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడే ఆస్కారముంది. అందుకే ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా పార్టీ భవిష్యత్ కోసం అర్జెంట్‌గా ఓ వ్యూహకర్తను ఎంపిక చేసుకోవాలని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.