నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారంలో రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ హైక‌మాండ్ హ్యాపీగా ఉన్న‌ట్లు స‌మాచారం. తెలంగాణతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోనూ ప్ర‌చారంతో రేవంత్ నేష‌న‌ల్ లెవ‌ల్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో రేవంత్ స్పీచ్‌ల కార‌ణంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రేవంత్ దూసుకెళ్తున్నారు. స‌భ‌లు, స‌మావేశాలు, ర్యాలీలు, రోడ్ షోల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. తెలంగాణ‌లో మెజారిటీ లోక్‌స‌భ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న సాగుతున్నారు. అయితే ప్ర‌చారంలో రిజ‌ర్వేష‌న్ల గురించి రేవంత్ ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దు అనేది బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ వందేళ్ల ఎజెండా అని రేవంత్ స్ప‌ష్టం  చేస్తున్నారు. ఆ పార్టీ చార్ సౌ పార్ నినాదం కూడా రిజర్వేష‌న్ల ర‌ద్దు కోస‌మేన‌ని రేవంత్ బ‌లంగా వాదిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుపై రేవంత్ వ్యాఖ్య‌లు నేష‌న‌ల్ లెవ‌ల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిపై బీజేపీ టాప్ లీడ‌ర్లు క్లారిటీ ఇవ్వ‌క త‌ప్ప‌డం లేదు. ఈ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ ఖండిస్తోంది. అయితే ఈ టాపిక్‌తో రేవంత్ కేవలం సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ పేరు సంపాదించుకుంటున్నారు. రేవంత్ వ్యాఖ్య‌లు అక్క‌డా చ‌ర్చ‌నీయాంశంగా మారాయ‌ని తెలిసింది. ఇది ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా. అందుకే ఆ పార్టీ కూడా రేవంత్‌కు ఫుల్ స‌పోర్ట్‌గా నిలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేత‌లు రేవంత్‌ను ప్ర‌త్యేకంగా అభినందించిన‌ట్లు కూడా స‌మాచారం.