టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మరో 10 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత దూకుడు పెంచనున్నారు. అయితే.. మరోపక్క రాష్ట్రంలో ఎండలు ఠారెత్తుతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉష్నోగ్రతలు 45- 47 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి.
దీంతో సాధారణంగా ఉదయం 9 గంటలకే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అలాగని ఎన్నికల ప్రచారం మానేస్తే.. వెనుకబడి పోతారనేది నాయకుల భయం. ఈ క్రమంలో కొందరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొందరు తెగించి ప్రచారం చేస్తున్నారు. ఇంకోందరు.. సాయంత్ర 4 గంటల తర్వాత.. బయటకు వస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే.. ఎండలు సైతం లెక్క చేయకుండా.. ఆయన ప్రచారంలో దూసుకు పోతున్నారు. అయితే.. వయసు రీత్యా ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు గత రెండు రోజుల నుంచి ప్రత్యేక మైన టోపీ ధరిస్తున్నారు.
ఎక్కడికి వెళ్లినా.. ఆయన ఈ టోపీతోనే దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా ఎండ వేళల్లో ఈ టోపీని పెట్టుకునే బయటకు వస్తున్నా రు. ప్రచార సభల్లోనూ ఈ టోపీతోనే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకుంటున్న ఈ టోపీ గురించి సోషల్ మీడియాలోనే కాకుండా.. టీడీపీ నేతల మధ్య కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక, ఈ టోపీ విషయానికి వస్తే.. ఇది కూలింగ్ టోపీ. దీనిని బ్రిటన్ నుంచి రెండు రోజుల కిందటే తెప్పించారని సమాచారం. దీనిని ప్రత్యేకమైన ఊలుతో తయారు చేస్తారు. ఎంత ఎండ ఉన్నప్పటికీ… ఇది వేడిని తలకు తగలకుండా కాపాడుతుంది. సుమారు 8 వేల రూపాయలని తెలిసింది. దీని నుంచి రక్షణ కలుగుతుందని.. అందుకే.. చంద్రబాబు దీనిని ధరిస్తున్నారని సీనియర్ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి ఎంత ఎండ ఉన్నా…. ప్రచారం తప్పక పోవడంతో చంద్రబాబు ఈ టోపీ పెట్టుకోవడం గమనార్హం.