కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతానని చెప్పారు. నిజానికి ఇప్పటి వరకు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్రభుత్వంపైనా సొంత అన్నపైనా ఆమె విమర్శలు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతానని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి అయిన తర్వాత. . ప్రత్యేక హోదా తెస్తానని కూడా చెప్పారు.
తాజాగా కడప జిల్లా బద్వేల్(కడప పార్లమెంటు పరిధిలో ఉంది) అసెంబ్లీ నియోజకవర్గంలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ ప్రచారం చేశారు. మహిళలను… రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ బిడ్డగా తాను బరిలో ఉన్నానని.. తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతానని.. అప్పుడు అందరి జీవితాలను బాగు చేస్తానని చెప్పారు.
ఇదేసమయంలో తన సోదరుడు, సీఎం జగన్ పై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను గెలిపిస్తే.. తనకు, తన చుట్టూ ఉన్న హంతక ముఠాకు.. బెయిల్ తెచ్చుకుంటాడని.. ఇంతకు మించి రాష్ట్రానికి ఏమీ చేయడని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించాలని కోరారు. “ఇక్కడే ఉంటా.. ప్రజల సేవ చేస్తా. కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతా. ప్రత్యేక హోదా సాధించుకొని వస్తా. అదే జగన్ గెలిస్తే. తనకు , వివేకానందరెడ్డిగారిని దారుణంగా చంపిన వారికి బెయిల్ తెచ్చుకుంటాడు” అని వ్యాఖ్యానించారు.
వైఎస్ వారసుడు జగన్ కాదన్నారు. ఆయన ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని ప్రశ్నించారు. వైఎస్ కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని అన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయితే. ఆయన కొడుకు హయాంలో రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడా లేడన్నా రు. పంట నష్టపరిహారం అని మోసం చేశాడని, ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని, నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడని షర్మిల దుయ్యబట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates