టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో అలాగే నరేంద్ర మోడీ ఫోటో కూడా వుండాలి కదా.? ఇదీ, వైసీపీ నుంచి దూసుకొస్తున్న ప్రశ్న.
ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో వుండాలని బీజేపీ అనుకుంటే, ఖచ్చితంగా వుంటుంది. కానీ, లేదంటే.. దానర్థమేంటి.? బీజేపీ జాతీయ పార్టీ. ఒకవేళ కూటమి మేనిఫెస్టో మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో వుంటే, దేశవ్యాప్తంగా అలాంటి మేనిఫెస్టో అమలు చేయాలని ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర నామ మాత్రమే. ఇది బీజేపీకి కూడా తెలుసు. పేరుకి ఆరు లోక్ సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నా, ఎన్ని సీట్లలో తమ ప్రభావం వుంటుందన్నది బీజేపీకి తెలిసే వుంటుంది.
జనసేన పార్టీ పరిస్థితి వేరు. జనసేన కూడా రాష్ట్ర పార్టీనే. రాష్ట్రంలో అధికార పీఠమెక్కాలనుకుంటోంది, ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలకే పరిమితమవుతోంది జనసేన పార్టీ. టీడీపీ – జనసేన ఈ విషయంలో ఒకే అభిప్రాయంతో వున్నాయి.
ఇక, వైసీపీ అభ్యంతరాలు.. అనడం కంటే, వైసీపీ భయాలని అనడం సబబేమో.! సామాజిక పెన్షన్ల విషయమై 4 వేలు నుంచి 60 వేల వరకూ మేనిఫెస్టోలో టీడీపీ – జనసేన కూటమి పెట్టడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఓటర్లంతా, కూటమికే బలంగా ఓట్లు గుద్దే అవకాశం వుంది. అదీ వైసీపీ భయం.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం దగ్గర్నుంచి, చాలా విషయాల్లో కూటమి హామీలు, వైసీపీ కంటే చాలా చాలా ముందున్నాయ్. ‘నవరత్నాలు ప్లస్’ అనే సరికొత్త వైసీపీ మేనిఫెస్టోని వైసీపీ కార్యకర్తలే చింపి పారేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.
‘అమలు చేయగలిగేవే మేనిఫెస్టోలో పెడుతున్నాం..’ అంటూ కొత్త పల్లవి అందుకున్న వైసీపీ, గతంలో అమలు చేస్తామన్న మద్య నిషేధాన్ని తాజా మేనిఫెస్టోలో పేర్కొనని సంగతి తెలిసిందే.
టీడీపీ మేనిఫెస్టో విడుదలవడంతోనే, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు పూర్తి స్థాయిలో టీడీపీ వైపుక తిరిగిపోయారన్న రిపోర్ట్, సాయంత్రానికే వైసీపీ అధినాయకత్వానికి అందిందట.