మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే చేసి, జగన్ ఫొటోలతో కూడిన డాక్యుమెంట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.
భూములకు సంబంధించి సరిహద్దు రాళ్ళ వ్యవహారమూ ఓ పెద్ద కుంభకోణమేనన్న విమర్శలున్నాయి. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు’ పేరుతో సరిహద్దు రాళ్ళను పెద్దయెత్తున తయారు చేయించి, పాతేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.

ఆ రాళ్ళకు అవుతున్న ఖర్చు ఎంత.? ఇంత ప్రజా ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు.? ప్రభుత్వం మారితే, ఆ రాళ్ళను తీసేసి, వేరే రాళ్ళను పెడితే, దానికయ్యే ఖర్చు ఎంత.? ఇలా చాలా అంశాలున్నాయి. అన్నిటికీ మించి, భూములకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు వాటి హక్కుదారులైన పౌరుల దగ్గర కాకుండా, ప్రభుత్వం దగ్గర వుంటాయనేదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాలూకు లిటిగేషన్.

ఈ వ్యవహారంపై చాలాకాలంగా న్యాయ నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అప్పట్లో ఈ అంశంపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకుండా పోయింది. కానీ, ఇప్పుడు ఎన్నికల సమయంలో విపక్షాలు, వివిధ రకాల రూపాల్లో ప్రజల్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై అవగాహన కల్పిస్తున్నాయి.

దాంతో, ప్రజల్లో.. అందునా చిన్నా చితకా భూములున్న సాధారణ ప్రజానీకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే భయపడుతున్నారు. ఇది అమల్లోకి వచ్చినట్లు ఇటీవల బయటకు వచ్చిన ఓ జీవో ద్వారా తేలడంతో, ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.

అధికార పార్టీ మాత్రం, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని అమల్లోకి తెద్దామనుకున్నామనీ, అదింకా అమల్లోకి రాలేదనీ బుకాయించాల్సి వస్తోంది. కానీ, జరగాల్సిన డ్యామేజ్ అయితే దారుణంగా జరిగిపోయింది.

ఏ రచ్చ బండ వేదిక దగ్గర చూసినా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన చర్చే జరుగుతోంది. భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు.? సరిహద్దు రాళ్ళపై జగన్ ఫొటో ఎందుకు.? ఆ హక్కు పత్రాలకు సంబంధించి జిరాక్సులు ప్రజలకిచ్చి, ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడమేంటి.? అని జనం నిలదీస్తున్నారు.
ఎన్నికల్లో వైసీపీకి ఇదొక ఎదురు దెబ్బలా మారే అవకాశం వుంది.