ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాలు మేనిఫెస్టోకు కొనసాగింపుగా.. ఇప్పుడు నవరత్నాలు 2.0ను సీఎం జగన్ ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా.. గత 2019లో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేసింది కూడా వివరించారు. ఇప్పుడు వాటినే కొనసాగిస్తామని చెప్పారు. అయితే.. గత మేనిఫెస్టోలో ఇచ్చిన నాలుగు కీలక హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేయలేదు. వాటిని తాజాగా కూడా ప్రస్తావించలేదు.
అయితే.. తాజాగా చంద్రబాబు వైసీపీ మేనిఫెస్టోపై స్పందించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు.. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. కూటమి పక్షాన తాను ప్రకటించిన సూపర్ 6
ముందు నవరత్నాలు 2.0
వెలవెల బోతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మేనిఫెస్టో ఓ చిత్తు కాయితం. మనం డీఎస్సీపై తొలి సంతకం పెడతామన్నా.. కానీ, ఆయన అసలు ఆ ఊసే ఎత్తలేదు. అంటే.. ఆయన ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వడు. కానీ, మనం తొలి సంతకంతోనే మెగా డీఎస్సీ వేసి 20 వేల మంది టీచర్లను భర్తీ చేయనున్నాం
అని చెప్పారు.
అదేవిధంగా .. వైసీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగుల ప్రస్తావనే లేకుండా చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసి.. కనీసం వారి చేతి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేని జగన్ మేనిఫెస్టోను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. సూపర్ 6లో ఈ విషయాన్ని కూడా చేర్చనున్నట్టుచెప్పారు. తాము అధికారంలోకి రాగానే.. రూ.3వేల చొప్పున స్టయిపెండ్ ఇస్తామన్నారు. ఏటా 4 లక్షల మందికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ, వైసీపీ మేనిఫెస్టోలో ఉద్యోగాల ప్రస్తావన లేదని దుయ్యబట్టారు.
“జగన్ అంటున్నాడు. రాష్ట్రంలో సంపద లేదట. ఎలా ఉంటుంది? నువ్వు.. నీ బ్యాచ్ కలిసి ప్రజల సంపదను దోచేశారు. నువ్వు ఏమీ చేయలేం. ఏమీ ఇవ్వలేవ్. నువ్వు తప్పుకో.. మేం వ్యవస్థను గాడిలో పెడతాం. రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కిస్తాం. చరిత్రను తిరగరాస్తాం“ అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు మేలు చేస్తామని.. ఇప్పటికే వారికి ఏడాదికి రూ.20 వేలు చొప్పున సాయం ప్రకటించామని.. జగన్ కనీసం రైతుల కన్నీళ్లు కూడా తుడవడం లేదని.. ముష్టి 16వేలు ప్రకటించాడని చెప్పారు. మహిళలకు ఏం ఇచ్చాడని ప్రశ్నించారు. తాము మాతృవందనం పేరుతో రూ.15 వేలు ఇస్తుంటే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంందికీ ఇస్తుంటే..జగన్ మాత్రం.. 17 వేలు ఇస్తాడంట” అని దుయ్యబట్టారు.