రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేతలకు ప్రత్యర్థుల రాజకీయాల నుంచి సెగ ఏమేరకు తగులుతున్నా.. ఎండల తీవ్రత కారణంగా.. రాజకీయ సెగ మాత్రం తగులుతోంది. సాధారణంగా.. సార్వత్రిక సమయం ఏప్రిల్‌తో ముగిసిపోతుంది. పోవాలి కూడా. 2019, 2014లోనూ ఇలానే ఏప్రిల్ రెండో వారానికి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. దీంతో నాయకులు సజావుగానే ప్రచారం చేసుకున్నారు. ఎండల తీవ్రత ఉన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య మాత్రం ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు.
దీనిలో ఆ పార్టీ ఈపార్టీ అనే తేడాలేదు. దీంతో గత ఎన్నికల్లో ఎండల నుంచి నాయకులకు పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పూర్తిగా ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది. ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు నాయకులకు, పార్టీలకు కూడా.. ఎండ పరీక్ష పెడుతోంది. ఏపీ, తెలంగాణల్లో పార్లమెంటు ఎన్నికల క్రతువు ప్రారంభమైనా.. పోలింగ్ మాత్రం మే 13నే జరగనుంది. దీంతో నాయకులు.. అప్పటి వరకు ప్రచారం చేయాల్సిందే.
అయితే.. ఇక్కడే పెద్ద విపత్తు వచ్చింది. సాధారణ ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. తెలంగాణలో అయితే.. మంటలు పుట్టిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోనూ వడగాడ్పులు పెరిగిపోయాయి దీంతో సాధారణ ప్రజలు బయటకు రావాలంటేనేఅధిరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా ప్రచారంలో ఉన్న నాయకులపైనే ప్రభావం చూపిస్తోంది. కార్యకర్తలు ముఖం చాటేస్తున్నారు. వస్తున్న వారు కూడా.. రోడ్డెక్కాలంటే.. ఇష్టపడడం లేదు.
దీంతో కొందరు నాయకులు తెల్లవారుజామున 5 గంటల నుంచే నాలుగు రోడ్ల కూడళ్లలో ఉన్న టీదుకాణాల వద్ద.. ప్రచారం చేస్తున్నారు. ఆరు గంటలకే ఇంటింటి బాట పడుతున్నారు. అయినప్పటికీ.. ప్రజలు ఆ సమయంలో బిజీగా ఉంటుండడంతో నాయకులు ఆశించిన మేరకు రియాక్షన్ రావడం లేదు. దీంతో సాయంత్రం 6 గంటల తర్వాత కానీ.. రాజకీయంగా దూకుడు ఉత్సాహం కనిపించడం లేదు. అయితే… అందరూ అదేసమయంలో ప్రచారం చేస్తుండడంతో మీడియా కవరేజీలో ఒకటి రెండు పార్టీలకు మాత్రమే ప్రాధాన్యం లభిస్తోంది. ఎలా చూసుకున్నా.. ఎండల దెబ్బ నాయకులపై భారీగానే కనిపిస్తుండడం గమనార్హం.