పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటన నేపథ్యంలో అస్వస్థతకు గురయ్యారు పవన్ కళ్యాణ్. అనంతరం, ఆయన కోలుకున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే వున్నారు.

జనసేన పార్టీకి సంబంధించినంతవరకు పవన్ కళ్యాణ్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుకే, జనసేనాని ఎన్నికల ప్రచారం ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ అత్యంత కీలకం. 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది.

వీటితోపాటుగా, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి కలిసి పోటీ చేస్తున్న మిగతా నియోజకవర్గాల్లోనూ కొంత మేర జనసేనాని ఎన్నికల ప్రచారం చేయాల్సి వుంది. అయితే, తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో జనసేనాని ఎన్నికల ప్రచారం విషయమై కొంత అయోమయం నెలకొంది.

తాజాగా జనసేన పార్టీ నుంచి అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యపై ఓ ప్రకటన వచ్చింది. రికరింగ్ ఇన్‌ఫ్లూయెంజా ఇన్‌ఫెక్షన్‌తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నట్లు జనసేన పార్టీ పేర్కొంది. ఈ క్రమంలో రోజూ ఏదో ఒక సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడుతున్నారట.

అందుకే, ఎన్నికల ప్రచార సమయంలో గజమాలల విషయమై అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకోవాలని జనసేన పార్టీ కోరుతోంది. మొహమ్మీద పూలు చల్లడం అనేది పవన్ కళ్యాణ్‌కి ఇబ్బందికరంగా మారుతున్న దరిమిలా, తగు జాగ్రత్తలు పాటించాలనీ జనసేన పార్టీ కోరుతోంది.

రాజకీయాల్లో పూలు చల్లకుండా, గజమాలలు లేకుండా అంటే కష్టమైన వ్యవహారమే. అందునా, పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్.. ఆ సినీ అభిమానుల అత్యుత్సాహం గురించి కొత్తగా చెప్పేదేముంది.? కోవిడ్ బారిన పడి కొన్ని రోజులపాటు పవన్ కళ్యాణ్ అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటినుంచే, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కొంత సెన్సిటివ్‌గా మారినట్లు చెబుతున్నారు.