బావ‌మ‌రిదినే ఆప‌లేక‌పోయారు..

తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి రోజురోజుకూ మ‌రింత దారుణంగా మారుతోంది. ఆ పార్టీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు కాంగ్రెస్‌లోకి చేరుతూనే ఉన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగి ఎన్ని మాట‌లు చెప్పినా ప‌రిస్థితుల్లో మార్పు రావ‌డం లేదు. ఇక కేటీఆర్‌, హ‌రీష్ రావు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేద‌నే చెప్పాలి. ముఖ్యంగా ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ వ్యూహాలు ఇప్పుడు ప‌నిచేయ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో, అంత‌కుముందు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్‌కు మెరుగైన ఫ‌లితాలు రావ‌డంలో కేటీఆర్‌దే కీల‌క పాత్ర అని ప్ర‌చారం జోరుగా సాగింది. అప్పుడు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబ‌ట్టి ఏం చేసినా క‌లిసొచ్చింది. కానీ ఆ జోరు ఎప్పుడూ ఉండ‌దు క‌దా. ఇప్పుడు కేటీఆర్‌కు ఆ విష‌యం అర్థమైన‌ట్లు ఉంది. అందుకే ట్ర‌బుల్ షూట‌ర్‌గా కేటీఆర్ ప్ర‌య‌త్నాలు ఏం ఫ‌లించ‌డం లేద‌ని చెబుతున్నారు. తాజాగా కేటీఆర్ బావ‌మ‌రిదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవ‌డంతో ఆయ‌న‌కు గ‌ట్టిదెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి.

లోక్‌స‌భ ఎన్నిక‌ల ముంగిట బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లువ‌లా వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేటీఆర్ బావ‌మ‌రిది ఎడ్ల రాహుల్ రావు కూడా రేవంత్ స‌మ‌క్షంలో హ‌స్తం కండువా క‌ప్పుకున్నారు. కేటీఆర్ భార్య నీలిమ సోద‌రుడే ఈ రాహుల్ రావు. ఈ ప‌రిణామం కేటీఆర్‌కు షాక్‌గా మారింది. సొంత బావ‌మ‌రిదినే ఆప‌లేని వాడు ఇక నాయ‌కులు పార్టీ మార‌కుండా ఎలా అడ్డుకుంటార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే గ‌త కొన్నేళ్లుగా కేటీఆర్‌, రాహుల్‌కు మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు అదును చూసి రాహుల్ దెబ్బ కొట్టార‌ని చెబుతున్నారు. దీంతో ఇక పార్టీని కేటీఆర్ ఏం కాపాడుతార‌నే ట్రోల్స్ విప‌రీతంగా వ‌స్తున్నాయి.