కడప జిల్లా మీద వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని ముఖ్యమంత్రి జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య తలెత్తిన విభేధాల మూలంగా ఈ సారి ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల మధ్య పెరిగి పెద్దయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసింది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకోసం పనిచేసింది. ఆ తర్వాత జగన్ తో విభేధించి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కూడా 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగింది.
రాజకీయ ఎత్తుగడల విషయంలో తాను ఏ మాత్రం తీసిపోను అంటూ షర్మిల కడప రాజకీయాలను నెరుపుతున్నట్లు కనిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కమలాపురం, రాజంపేట మినహా అన్ని స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే కడప నియోజకవర్గంలో మైనారిటీలది కీలకపాత్ర. అక్కడి నుండి కాంగ్రెస్ తరపున మైనారిటీ నేత అఫ్జల్ ఖాన్ ను బరిలోకి దింపాలని షర్మిల యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు వైసీపీ గెలుపుకు గండి కొడుతుందా ? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అఫ్జల్ ఖాన్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున శాసనసభకు పోటీ చేసి దాదాపు 14 వేల ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో అతన్ని బరిలోకి దించితే మైనారిటీ ఓట్లు చీల్చడం ఖాయం అని భావిస్తున్నారు. వైసీపీకి సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఈ పరిస్థితులలో కీలకమైన ఓట్లలో చీలిక ఆ పార్టీకి ఇబ్బందికరమే అన్న వాదన వినిపిస్తుంది. మరి షర్మిల ఎత్తులు ఈ విషయంలో ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates