బీజేపీలో మాధవీలతకు ఎందుకంత ప్రాధాన్యం ?

దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న పార్లమెంటు స్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ 1984 నుండి 1999 వరకు ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుండి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం ఆధీనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ ఇక్కడి నుండి నిలబెట్టిన అభ్యర్థి కొంపెల్లి మాధవీలత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

హిందుత్వ ప్రచారంతో గత కొన్ని నెలలుగా మీడియా, సోషల్ మీడియా ప్రచారంలో అనూహ్యంగా ముందుకు వచ్చిన మాధవీలత తెలంగాణ బీజేపీ నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో టికెట్ సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మాధవీలత మీద గుర్రుగా ఉన్నా నేరుగా మోడీ కార్యాలయం నుండి మాధవీలత ప్రచార కార్యక్రమాలు, అందులో పాల్గొంటున్న నేతల గురించి ఆరా తీస్తున్న నేపథ్యంలో కిక్కురుమనకుండా ఆమెతో స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది.

13 రోజుల క్రితం ఇండియా టీవీ ఆప్ కి ఆదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొన్నది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునివ్వడంతో మాధవీలత పేరు మార్మోగిపోయింది. ఈ కార్యక్రమానికి 3.6 మిలియన్ల వీక్షణలు రావడం ఈ సంధర్భంగా ప్రస్తావనార్హం. ఎంఐఎంను కట్టడి చేయడం అంత తేలిక కాదు. ఓవైసీని ఢీ కొట్టే స్థానంలో ఉన్నందునే మాధవీలతకు బీజేపీ పెద్దలు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ స్థానం గెలవాలన్న బీజేపీ పెద్దల ఆశలు ఎంత వరకు నెరవేరతాయో వేచిచూడాలి.