రాయలసీమ గడ్డ అంటే వైఎస్ కుటుంబానికి కంచు కోట. ఇక్కడి రాజకీయాల్లో ఆ కుటుంబానిదే ఆధిపత్యం. ఇప్పుడు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కూడా పొలిటికల్‌గా అదే బలం. ఇప్పుడీ బలంపై దెబ్బకొట్టేందుకు జగన్ చెల్లి వైఎస్ షర్మిల వచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా దూకుడు ప్రదర్శిస్తున్న షర్మిల.. రాయలసీమలో అన్నకు షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె.. ఇప్పటికే సీమలో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య కేసులో అవినాష్, జగన్‌పై ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సీమలో సంచలనంగా మారాయి. జనాలందరూ దీని గురించి చర్చించుకుంటున్నారనే చెప్పాలి. ఎన్నికల సమయంలో వివేకా హత్య గురించి ప్రస్తావించకుండా కోర్టుకు వెళ్లి వైసీపీ ఆదేశాలు తెచ్చుకున్నాదంటేనే షర్మిల మాటలు ఎంతగా ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక కడపలో అవినాష్‌కు వ్యతిరేకంగా షర్మిల పోటీకి దిగడమే సంచలనంగా మారింది. కడప నుంచి ప్రచారం ప్రారంభించిన షర్మిల సీమ అంతా చుట్టేస్తున్నారు. ఇక్కడ షర్మిల సభలు, ప్రచారానికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుండటం విశేషం. కడప, కర్నూలు జిల్లాల్లో షర్మిల ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల ప్రచారం నిర్వహించబోతున్నా రాయలసీమపైనే ఆమె స్పెషల్‌గా ఫోకస్ పెట్టారు. వైసీపీకి పడే ఓట్లను తమవైపు మళ్లించుకోవాలనే ప్రణాళికతో సాగుతున్నారు. రాయలసీమలో కాంగ్రెస్ ఇప్పటికిప్పుడే సీట్లు గెలవకపోవచ్చు కానీ వైసీపీని ఓటమి దిశగా నడిపించడంలో ప్రభావం చూపే ఆస్కారముంది. అదే జరిగితే షర్మిల రాజకీయంగా మరింత పట్టు సాధించే అవకాశం కలుగుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates