తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ సవాలుగా నిలిచాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ఇక్కడ మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలిచి హైకమాండ్‌కు బహుమతి ఇవ్వాలనే సీఎం రేవంత్ పట్టుదలతో ఉన్నారు. అందుకే 17కి గాను 15 స్థానాల్లో గెలవాల్సిందేననే లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడిగానూ ఉన్న రేవంత్ సాగుతున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పార్టీ గెలుపు కోసం కసరత్తులు చేస్తున్నారు. అయితే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం రేవంత్‌కు పరీక్షగా నిలుస్తోంది. ఇక్కడ విజయం సాధించడం ఆయనకు ఎంతో ఇంపార్టెంట్‌గా మారింది.
మల్కాజిగిరిలో ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే అది రేవంత్‌కు డ్యామేజీగా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2019 లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచింది రేవంత్ రెడ్డే. గత ఎన్నికల్లో తాను గెలిచిన స్థానాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే అది రేవంత్‌కు దెబ్బే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్.. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీని వెనక్కినెట్టి కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు 10,919 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.
అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిరిగిలో ఈ సారి కూడా హోరాహోరీ పోరు తప్పేలా లేదు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి పోటీపడుతున్నారు. దీంతో రేవంత్కు టఫ్ టెస్టుగా ఈ ఎన్నిక నిలుస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఇప్పుడు కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక)నూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్‌కు ఉన్న బలానికి ఇదే నిదర్శనం. ఇక బీజేపీ కూడా పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలవాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందే. ఈ విషయం తెలిసిన రేవంత్ కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తూ జనాలను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.