ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికార వైసీపీకి, టీడీపీకి కీలకంగా మారాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం జగన్.. ఈ సారి కూటమిని అధికారంలోకి తేవడం కోసం బాబు తెగ కష్టపడుతున్నారు. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నికలు మాత్రం హోరాహోరీగా ఉండే పరిస్థితులు కనిపించడం లేదనే టాక్. ఏ సర్వే కూడా టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పడం లేదు. అన్ని సర్వేలు టీడీపీ కూటమిదే విజయమని ప్రకటిస్తున్నాయి. దీంతో చంద్రబాబు మరింత జోష్‌తో సాగుతున్నారు. జగన్ లో ఓటమి భయం కనిపిస్తోందని విమర్శిస్తూ విజయంపై ధీమాతో బాబు ఉన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్‌పై, వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మరింత అనుకూలంగా మార్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిమాణాలు చూస్తుంటే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే విజయమని అనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వరకూ మరింత జాగ్రత్తతో ఈ కూటమి సాగడం ముఖ్యం. ప్రజల ఆదరణను ఓట్ల రూపంలోకి మారిస్తేనే కూటమి గెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలపై బాబు స్పెషల్‌గా ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది.ఇప్పటివరకూ టీడీపీకి పెద్దగా అచ్చిరాని ఈ నియోజకవర్గాల్లో గెలుపు బావుటా ఎగిరేస్తే అది పార్టీకి మరింతగా కలిసొస్తుందని బాబు నమ్ముతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బోణీ కొట్టలేకపోయింది. పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూరల్, పులివెందుల తదితర నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిందే లేదు. ఇక విజయవాడ పశ్చిమ, కోడుమూరు, యర్రగొండపాలెంలోనూ పరిస్థితి అంతంతమాత్రమే. ఇలాంటి నియోజకవర్గాల్లో ఈ సారి విజయం సాధిస్తే అధికారం దక్కించుకోవడం మరింత తేలికవుతుందన్నది బాబు అభిప్రాయమని టాక్. అందుకే ఈ నియోజకవర్గాలపై బాబు స్పెషల్‌గా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ వైసీపీని దెబ్బకొట్టే వ్యూహాలు రచిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.