ఏపీలో కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీగా వెల్లడిస్తున్న కేసుల లెక్క చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగానే బయటకు వస్తుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల నమోదు అంతకంతకూ పెరగటం వెనుక పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటం కూడా కేసులు వెలుగుచూడటానికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో రోజూ ఎనిమిదివేల మందికి కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్యను పదివేల మంది వరకూ తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ పరీక్షలు జరుపుతున్నామని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక అధికారులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి పదిలక్షల మంది జనాభాకు 451 మందికి మాత్రమే కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 1274 మందికి పరీక్షల్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ కారణంతోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పక తప్పదు.

ఆదివారం సాయంత్రం నాటికి ఏపీ వ్యాప్తంగా 68,034 టెస్టులు చేయించగా 1097 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే.. మొత్తం పరీక్షల్లో 1.6 శాతం మాత్రమే నిర్దారణ కేసులు కావటం గమనార్హం. జాతీయ సగటు చూస్తే ఇది 4.21 శాతంగా ఉంది.

పైకి చూసేందుకు ఏపీలో ఎక్కువగా కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నది మర్చిపోకూడదు. చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు పరిమితంగా చేయిస్తుండటంతో.. కేసుల నమోదు తక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఏపీలో ఎక్కువ పరీక్షలు చేయిస్తుండటంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.