అవినాష్ హంతకుడు.. వివేకా హత్య వెనుక ఉన్నది ఆయనే అంటూ షర్మిల, సునీత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కడప లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇంకోవైపు ఈ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులున్నాయనే టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో కడప ఎంపీ సీటును కాపాడుకోవడం వైఎస్ అవినాష్ రెడ్డికి కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఆయన రంగంలోకి దిగి పరిస్థితి మెరుగుపర్చే ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారకుడు అవినాష్ అంటూ వైఎస్ షర్మిల, సునీత తీవ్రంగా ఆరోపిస్తున్నారు. హంతకుడిని మరోసారి ఎలా గెలిపిస్తారంటూ కడప ప్రజలను ప్రశ్నిస్తున్నారు. న్యాయం చేయమంటూ కొంగుబట్టి మరీ అడుగుతున్నారు. దీంతో కడప లోక్‌సభ నియోజకవర్గంలో అవినాష్‌పై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గ్రాఫ్ పెరుగుతోందని అంటున్నారు.
మరోవైపు కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. జమ్మలమడుగు అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి తీరు వైసీపీకే నష్టం చేసేలా ఉందని టాక్. ఇక్కడ పార్టీ క్యాడర్‌ను పట్టించుకున్న పరిస్థితే లేదని చెప్పాలి. ఇక గండికోట జలాశయం ముంపు వాసులకు రూ.10 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. ప్రొద్దుటూరులోనూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యవహారంతో అక్కడ వైసీపీ ఒంటరయ్యే పరిస్థితి. మైదుకూరు, కమలాపురంలోనూ పరిస్థితి ఇంచుమించుగా ఇలాగే ఉంది. వెంటనే అవినాష్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం షాక్ తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates